లగ్జరీగానే చిన్నమ్మ

4 Oct, 2019 07:38 IST|Sakshi

సమాచార చట్టం ద్వారా వెలుగులోకి

సామాజిక కార్యకర్త వివరాల సేకరణ

అమ్మ శిబిరంలో ఆగ్రహం

సాక్షి, చెన్నై : పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ శశికళకు నేటికీ లగ్జరీ సేవలు, పలు రకాల రాయితీలు అందుతున్నట్టుగా మళ్లీ ఆరోపణలు బయలు దేరాయి. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు సామాజిక కార్యకర్త ఒకరు చేసిన వ్యాఖ్యలు అమ్మ శిబిరంలో ఆగ్రహాన్ని రేపుతున్నాయి.అక్రమాస్తుల కేసులో అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓ మారు ఆమెకు అందుతున్న లగ్జరీ సేవల వ్యవహారం దుమారానికి దారి తీసింది. జైళ్ల శాఖ అధికారి రూప స్వయంగా ఆరోపణలు గుప్పించడంతో విచారణకు పరిస్థితులు దారి తీశాయి.

ఆ తదుపరి పరిణామాలతో చిన్నమ్మ సత్‌ ప్రవర్తనతో ముందస్తుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుతగ్గ ప్రయత్నాల మీద అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ సైతం ఉన్నారు. చిన్నమ్మ ఈఏడాది చివర్లో జైలు నుంచి బయటకు రావడం ఖాయం అన్న ధీమాను ఆ శిబిరం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శశికళకు గతంలో వలే ఇప్పుడు కూడా రాయితీలు, లగ్జరీ సేవలు జైలులో అందుతున్నట్టుగా కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహ  ఆఆరోపణలు గుప్పించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగాకొన్ని ఆధారాలను ఆయన బయట పెట్టారు.

నిబంధనలకు తిలోదకాలు...
చిన్నమ్మ శశికళ జైలులో వ్యవహరిస్తున్న విధానం,  ఆమెతో సాగి ఉన్న ములాఖత్‌ల మీద సమాచార హక్కు చట్టం నరసింహ వివరాలను సేకరించి ఉన్నారు. అందులో లభించిన వివరాల మేరకు ఆమెకు నేటికి జైల్లో లగ్జరీగానే సేవలు రాజమార్గంలోనే అందుతున్నట్టుగా ఉందని ఆరోపించారు. జైలు నిబంధనల మేరకు  శిక్ష అనుభవిస్తున్న ఒకరితో ములాఖత్‌కు నలుగుర్ని మాత్రమే అనుమతించాల్సి ఉందని, అయితే, శశికళను చూడటానికి ఏకంగా ఆరుగుర్ని పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెల శశికళను మాజీ ఐఎఎస్‌ అధికారి చంద్ర లేఖ , దినకరన్, ఆయన భార్య అనురాధా, కుమార్తె జయహరినిలతో పాటుగా రాజన్, పుగలేందిలు ములాఖత్‌ అయ్యారని వివరించారు. దీనిని బట్టి చూస్తే, రాజమా«ర్గంలోనే ఆమెకు కర్ణాటక జైళ్ల శాఖ వర్గాలు సేవల్ని అందిస్తున్నట్టుందని ఆరోపించారు.

తప్పని సరి పరిస్థితి అన్నది ఉంటే ఏడుగుర్ని అనుమతించ వచ్చు అని, అయితే, ఆ పరిస్థితి ఇక్కడ లేని దృష్ట్యా, నిబంధనల్ని ఉల్లంఘించి ఆరుగుర్ని అనుమతించడమే కాదు, 45 నిమిషాల పాటుగా ములాఖత్‌కు అనుమతించి ఉన్నారని వివరించారు.  అయితే, నరసింహ వ్యాఖ్యలను అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చిన్నమ్మ విడుదలను అడ్డుకునేందుకు ఇలాంటి శక్తులు తెర మీదకు ఇక రావడం సహజమేనని పేర్కొంటున్నాయి. జైలు నిబంధనలకు అనుగుణంగానే చిన్నమ్మ అక్కడ ఉన్నారని, ములాఖత్‌కు  ఇద్దరు ముగ్గుర్ని తప్పా,  ఎక్కువ మందిని ఆమే అనుమతించడం లేదని  ఆ శిబిరానికి చెందిన ఓ నేత పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు