రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌గా సైనీ

30 Jun, 2018 02:38 IST|Sakshi
మదన్‌లాల్‌ సైనీ

పంతం నెగ్గించుకున్న రాజే

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ మదన్‌లాల్‌ సైనీ రాజస్తాన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఈ నియామకాన్ని ఖరారు చేశారు. సీఎం వసుంధరా రాజే, అమిత్‌ మధ్య చర్చలు జరిగాక జాట్‌లు, రాజ్‌పుత్‌ వర్గాల మధ్య విభేదాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మాలీ వర్గానికి చెందిన సైనీకి ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇదే సామాజిక వర్గానికి చెందిన అశోక్‌ గెహ్లాట్‌ (కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం)కు చెక్‌ పెట్టవచ్చని బీజేపీ భావిస్తోంది. ‘రాష్ట్రంలోని 200 అసెంబ్లీ సీట్లలో 180, మొత్తం 25 లోక్‌సభ స్థానాలు గెలవడంపైనే దృష్టి పెడతాను’ అని సైనీ అన్నారు.

ఇన్నాళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్నందుకే సైనీకి ఈ అవకాశం వచ్చిందని పలువురు రాజస్తాన్‌ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తన అనుచరుడే ఉండాలని పట్టుబడుతున్న సీఎం వసుంధర రాజే కొంతమేర విజయం సాధించారనే చెప్పవచ్చు. గజేంద్రసింగ్‌ షెకావత్‌కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం భావించినా.. దీనికి వసుంధర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏ వర్గానికీ చెందని, సంఘ్‌ పరివార్‌తో సంబంధమున్న సైనీని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు చేయడంతో ఒక రకంగా వసుంధరా తన ప్రత్యర్థులను నిలువరించినట్లే.

మరిన్ని వార్తలు