ఖట్టర్‌ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం

10 Aug, 2019 16:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో రాజకీయ నాయకులు అత్యుత్సాహంతో చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ.. విమర్శల పాలవుతున్నారు. ఈ క్రమంలో శనివారం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ‘ఇక మీదట అందమైన కశ్మీరీ యువతులను కోడళ్లుగా తెచ్చుకోవచ్చు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖట్టర్‌ వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని దీదీ సూచించారు.

ఈ మేరకు దీదీ ట్విటర్‌లో ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాలి. అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేసి ఇతరులను బాధించకూడదు. కశ్మీరీ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది. మీ వ్యాఖ్యలు కేవలం కశ్మీరీ ప్రజలనే కాక యావత్‌ దేశ ప్రజలను బాధించాయి’ అంటూ మమతా ట్వీట్‌ చేశారు.
 

'బేటీ బచావో, బేటీ పడావో' కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టారియా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అమలుకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని చెప్పారు. 1000 మంది బాలలకు 850 నుంచి 933 మంది బాలికలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. అప్పుడు బిహరీ యువతులను కోడళ్లుగా చేసుకునే వాళ్లం అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ఇక మీదట అందమైన కశ్మీరీ యువతులను కోడళ్లుగా చేసుకోవచ్చు అంటూ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు