అత్యాచారాల్ని కులంతో ముడిపెట్టొద్దు

25 Dec, 2019 09:41 IST|Sakshi

‘దిశ’కో న్యాయమా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకోన్యాయమా..?

మహాదీక్షలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 

కవాడిగూడ: మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలను కులంకోణంతో చూడొద్దని, కేవలం మానవతా దృక్పథంతోనే చూడాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు కులమతాలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గొంతెత్తుతున్న చరిత్ర తమదని ఆయన స్పష్టం చేశారు. దిశ ఘటనకు మూడ్రోజుల ముందు మూడు ఘటనలు జరిగినప్పటికీ వాటిపై చర్యలు చేపట్టకుండా దిశ ఘటనపై మాత్రమే ఓ సామాజికవర్గం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకే పోలీసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ఛలో ఇందిరాపార్క్‌ మహాదీక్షకు వివిధ కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి.

ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..దేశాన్ని కుదిపేసిన గాంధీ, ఇందిరా, రాజీవ్‌గాంధీలను హత్యచేసిన నిందితులను చట్టపరంగానే శిక్షించారేతప్ప ఎన్‌కౌంటర్‌ చేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాది కసబ్‌ సజీవంగా దొరికినా కాల్చి చంపలేదెందుకని ప్రశ్నించారు. దేశంలో 15 ఏళ్లలో 3 లక్షల 41 వేలమంది మహిళలపై అత్యాచారాలు జరిగితే అప్పుడు లేని ఎన్‌కౌంటర్‌లు దిశా నిందితుల విషయంలో మాత్రమే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిశ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కానీ అంతకుముందు జరిగిన టేకు లక్ష్మీ, మానస కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నెలరోజుల పాటు 119 నియోజకవర్గాల్లో అత్యాచార ఘటనలపై జరుగుతున్న వివక్ష న్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్య పరచాలన్నారు. దీనిపై త్వరలోనే ‘చలో హైదరాబాద్‌’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేబీ రాజు అధ్యక్షతన జరిగిన మహాదీక్షలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, దాసు సురేశ్‌, ప్రొఫెసర్‌ గాలి వినోద్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు