నెహ్రూ ప్రతిష్టను తగ్గించేందుకే..

27 Aug, 2018 08:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం (ఎన్‌ఎంఎంఎల్‌), తీన్‌మూర్తి కాంప్లెక్స్‌ల స్వరూపం మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నెహ్రూ కేవలం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, ఆయన దేశానికి నేతని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ఎలాంటి మార్పులూ చేపట్టరాదని కోరారు.

ఆరేళ్ల పాటు ప్రధానిగా వ్యవహరించిన అటల్‌ బిహారి వాజ్‌పేయి హయాంలో ఎన్‌ఎంఎంఎల్‌, తీన్‌మూర్తి కాంప్లెక్స్‌ స్వభావం, రూపురేఖల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని, అయితే ఇప్పుడు ప్రభుత్వ అజెండాలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ప్రధానులందరి మ్యూజియం నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోందనే వార్తల నేపథ్యంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

నెహ్రూ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకే మోదీ సర్కార్‌ ఇలాంటి చర్యలకు దిగుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. దేశానికి నెహ్రూ సేవలను ఎవరూ తగ్గించలేరని లేఖలో మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దేశ తొలి ప్రధాని మెమోరియల్‌గా తీన్‌మూర్తి భవన్‌ను వదిలివేయాలని, అప్పుడే మనం చరిత్రను, ఘన వారసత్వాన్ని గౌరవించినట్లవుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు