రాష్ట్రంలో మీడియాకు స్వేచ్ఛ లేదు

23 Oct, 2018 01:44 IST|Sakshi

ప్రజాపక్షం పత్రిక ప్రారంభోత్సవంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

పాలించేవారికి సొత్తులుగా కొన్ని సంస్థలు

హైదరాబాద్‌: తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేదని కొన్ని మీడియా సంస్థలు పాలించేవారికి సొత్తులుగా మారుతున్నాయని, అధికారంలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బండ్లగూడలో గిరిప్రసాద్‌ భవన్‌లో నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ప్రజాపక్షం అనే తెలుగు పత్రిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తమ్‌ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ, కేసీఆర్‌ ప్రజాస్వామ్య విలువలను అణచివేసే ప్రక్రియను బహిరంగంగానే చేపట్టారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలుస్తే ప్రజాస్వామ్యం బతకదని, తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థలు ఇతర రంగాలను శాసించినట్లే మీడియాను కూడా శాసిస్తున్నాయని అన్నారు. మీడియాను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. నాలుగేళ్లకే పాలన పగ్గాలు పడేసి మళ్లీ ఓటు కోసం వస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు అడ్డుకుంటున్నారని తెలిపారు.

పత్రికా స్వేచ్ఛను కేసీఆర్‌ ప్రభుత్వం హరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. అన్ని పక్షాలు ఏకమై టీఆర్‌ఎస్‌ పార్టీని ఇంటికి పంపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి  పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం ఎడిటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ జాయింట్‌ సెక్రటరీ దేవులపల్లి అమర్, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్‌పాషా, మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడ నాగేశ్వర్‌రావు, గుండా మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు