పట్టణాల రూపురేఖలు మార్చాలి

31 Jan, 2020 03:00 IST|Sakshi
కొత్తగా ఎన్నికైన నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పనకు గురువారం శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి కేటీఆర్‌

ఇళ్ల నిర్మాణాల్లో వసూళ్లకు పాల్పడితే పదవి పోయినట్టే

కొత్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌

మున్సిపోల్స్‌లో టీఆర్‌ఎస్‌ విజయం దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాదు

ఉత్తమ్‌ ఇక ఇంటికి పరిమితమైతేనే బాగుంటుందని ఎద్దేవా..  

సాక్షి, హైదరాబాద్‌: ప్రణాళికాబద్ధ అభివృద్ధితో పట్టణాల రూపురేఖలు మార్చాలని మున్సి పల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. లం చం ప్రస్తావన లేకుండా.. పారదర్శక పాలనతో ప్రజలకు సేవ చేయాలని, లేకుంటే పదవులు ఊడుతాయని స్పష్టంచేశారు. ఇళ్ల నిర్మాణాల అనుమతులను త్వరితగతిన ఇవ్వాలన్నారు. కొత్తగా ఎన్నికైన కొత్త మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఉద్దేశించి గురువారం ప్రగతి భవన్‌లో ఆయన ప్రసంగించారు. ‘మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ విజయం ద్వారా మరోసారి టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆశీర్వదించారు. సాధా రణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలకు మిశ్రమ ఫలితాలు వస్తుంటాయి. కానీ, ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో దాదాపుగా టీఆర్‌ఎస్‌ సాధించిన మెజార్టీ దేశ చరిత్రలో మరే పార్టీకీ సాధ్యం కాలేదు.

2014 జూన్‌ నుంచి నేటి వరకు తెలంగాణలో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. ఎన్నిక ఏదైనా విజయం టీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లతో గద్దెనెక్కిన పార్టీ, 2018లో 88 అసెంబ్లీ సీట్లతో అఖండ మెజారిటీ సాధించింది. రాహుల్, చంద్రబాబు ఒక్కటైనా కారును ఓడించలేకపోయారు. సర్పంచ్‌ ఎన్నికల్లో 85 శాతం గ్రామాల్లో పార్టీ మద్దతుదారులు గెలిచారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్‌లకు 32 కైవసం చేసుకుని రికార్డు సృష్టించాం. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 80 శాతం కైవసం చేసుకున్నాం. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 112 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు గెలుచుకుని తిరుగులేని విజయం సాధించడం ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణకు నిదర్శనం..’అనిచెప్పారు.

ఓటేసిన ప్రజలను అవమానించడమే..
స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ రెడీగా ఉన్నా.. కాంగ్రెస్‌ కోర్టుల్లో దాదాపు 80 పిటిషన్లు వేసి జాప్యం చేసిందని కేటీఆర్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ తరఫున 8,900 మంది నామినేషన్లు వేస్తే.. కాంగ్రెస్, బీజేపీకి కలిపి 1,200 స్థానాల్లో బీఫారం ఇస్తామన్నా.. పోటీ చేసే నాథుడు కరవయ్యాడని ఎద్దేవా చేశారు. డబ్బులతో జనాలను కొనుగోలు చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం ముమ్మాటికీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలందరినీ కించపరచడమేనన్నారు. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ ఓటమి చవిచూసిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఇంటికి పరిమితమైతే బావుంటుందని వ్యాఖ్యానించారు.

నిధులపై ఆందోళన వద్దు..
ప్రతీ కౌన్సిలర్‌ కేసీఆర్‌లా స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహన పెంచుకోవాలని కేటీఆర్‌ సూచించారు. నిధులపై ఆందోళన వద్దని.. ప్రతీనెలా మొదటివారంలో అవి వస్తాయని భరోసా ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాల దరఖాస్తులను 21 రోజుల్లో పరిష్కరించాలన్నారు. అవినీతి ఆరోపణలు వస్తే పదవులు ఊడతాయని స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త మున్సిపల్‌ చట్టంపై శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. 57 శాతం మహిళలకు సీట్లు ఇచ్చి మహిళా సాధికారతకు పెద్దపీట వేశామన్నారు. సామాజిక న్యాయం పాటించి 108 చోట్ల వివిధ బలహీన వర్గాల అభ్యర్థులకు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లుగా అవకాశం కల్పించామన్నారు. పారదర్శకంగా పనిచేసి పట్టణ ప్రగతి పథకం విజయవంతమయ్యేలా శ్రమించాలని సూచించారు.

కేసీఆర్‌ పీఎం.. కేటీఆర్‌ సీఎం: గంగుల
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఈ స్థాయిలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఒక పార్టీకి రావడం స్వతంత్ర భారతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చిరునామా ఉమ్మడి కరీంనగర్‌లో గల్లంతైందన్నారు. రాబోయే 40 ఏళ్లు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందన్నారు. దేశానికి కేసీఆర్‌ ప్రధాని.. రాష్ట్రానికి కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు