చంద్రబాబు డ్రామాలొద్దు: కురసాల కన్నబాబు

6 Jan, 2020 19:05 IST|Sakshi

సాక్షి, కాకినాడ: గతంలో చంద్రబాబు అధికార ఉన్మాదంతో అరాచకాలకు పాల్పడ్డారని.. ఆయనే అధికార ఉన్మాది అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం కాకినాడలో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేమ.. వెనుకబడిన ప్రాంతాలపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ‘అధికార వికేంద్రీకరణ జరగాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగకూడదా..? చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలా? వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణకు ఆయన ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎగ్జిక్యూటివ్‌, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌కు చంద్రబాబు వ్యతిరేకమా..’ అంటూ పలు ప్రశ్నలను మంత్రి సంధించారు.

చంద్రబాబు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు..
స్వార్థం కోసమే చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జీఎన్‌రావు, విజయ్‌కుమార్‌లాంటి అధికారులపై  అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని.. అధికారులను కించపరడం మానుకోవాలని హితవు పలికారు. బీసీజీ నివేదికను మంటల్లో వేయమనడం ఎంత వరకు సమంజసం అని  ప్రశ్నించారు. శివరామకృష్ణన్‌ కమిటీకి అబద్ధాలు అంటగడుతున్నారని.. వాళ్లు చెప్పింది ఒక్కటైతే.. చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లాంటి రాజధాని వద్దని శివరామకృష్ణన్‌ చెప్పారని.. దానికి విరుద్ధంగా చంద్రబాబు అమరావతి అంటున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

డ్రామాలొద్దు..
చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ఇకనైనా డ్రామాలు ఆపాలన్నారు. చంద్రబాబు మాయలో పడొద్దని రైతులకు కన్నబాబు సూచించారు. ఫ్యూడలిస్టు విధానాలకు సీపీఐ నారాయణ మద్దతు పలుకుతున్నారా అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు పూర్తిగా న్యాయం చేస్తామన్నారు. ‘అమరావతి ముద్దు- రాష్ట్రాభివృద్ధి వద్దు అన్నది చంద్రబాబు నినాదం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ముద్దు అన్నది సీఎం జగన్‌ నినాదం’ అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు