'అడ్డువస్తే నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారు'

2 Nov, 2019 10:59 IST|Sakshi

జలాలాబాద్‌ : పంజాబ్‌ రాష్ట్రంలోని జలాలాబాద్‌ నియోజకవర్గం శిరోమణి అకాలీదల్‌ పార్టీకీ కంచుకోటలాంటిది. పంజాబ్‌కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. దీంతో అకాలీదల్‌ పార్టీకి ఇక్కడ మంచి పట్టుంది. తాజాగా జలాలాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన రమీందర్‌ ఆవ్లా విజయం సాధించారు. ఈ సందర్భంగా రమీందర్‌ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

అకాలీదల్‌కు మంచి పట్టున్న జలాలాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం తనకు చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. బీజేపీ- అకాలీదల్‌ పాలనలో ఇక్కడ గూండారాజ్యం కొనసాగిందని, అడ్డు వచ్చిన వారిపై నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారని తెలిపారు. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుందనడానికి తన గెలుపు ఒక కారణమని రమీందర్‌ వెల్లడించారు. 2017లో సుఖబీర్‌సింగ్‌ విజయం సాధించినా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ బీజేపీ- అకాలీదల్‌ పాలనలో వారు పెట్టిన నకిలీ కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరించారని గుర్తుచేశారు.దీంతో అకాలీదల్‌ 10 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయాలు ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన సుఖ్‌బీర్‌ సింగ్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తన బాధ్యతను విస్మరించారు. అందుకే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో అకాలీదల్‌ను కాదని కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారని వెల్లడించారు.

ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన జలాలాబాద్‌ ప్రజలకు రమీందర్‌ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. రైస్‌ మిల్లర్‌ వ్యాపారులకు ఆశించినంత మేర వ్యాపారం జరగకపోవడంతో ఎక్కువ మొత్తంలో మిల్లులు మూసివేయడం గుర్తించాను. అలాగే ఈ ప్రాంతంలోని స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడం దారుణం అని వెల్లడించారు. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా బలంగా ఉంది. ఈ సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అలాగే త్వరలోనే ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ని కలిసి నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చిస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు