‘టీఆర్‌ఎస్‌ పని శూన్యం.. ప్రచారం ఘనం’

29 May, 2018 15:52 IST|Sakshi

సాక్షి, హైదారాబాద్‌: ‘తెలంగాణలో విద్యను వ్యాపారంగా మార్చారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపైన చర్యలు తీసుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని* కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరితో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తితో ఉన్నారని పొంగులేటి పేర్కొన్నారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడమే పరమావధిగా మారిన ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ సంస్థల చేతుల్లో ప్రభుత్వం..!
కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయని పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. వాటి నియంత్రణపై రూపొందించిన నియమ నిబంధనలు, జీఓలను ప్రభుత్వం కావాలనే అటకెక్కించిందని ఆయన ధ్వజమెత్తారు. 

సీఎం స్పందించాలి..
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని పొంగులేటి అన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం కల్పించుకొనే ప్రభుత్వానికి... చిత్తశుద్ధి ఉంటే ఫీజుల నియంత్రణపై వెంటనే కార్యాచరణ రూపొందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బంగారు తెలంగాణ సాధిస్తామని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారి ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు