వైఎస్సార్‌సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌

14 Feb, 2019 16:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతకొంతకాలంగా చంద్రబాబు పరిపాలన, టీడీపీ తీరుతో అసంతృప్తితో ఉన్న అవంతి శ్రీనివాస్‌ గురువారం లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వైఎస్‌ జగన్‌ సమక్షంలో లాంఛనంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆమంచి కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీకి దెబ్బ మీద దెబ్బ
ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనం ఖాయమని సర్వేలు చాటుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన టీడీపీలోని బలమైన నేతలు వరుసగా వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైఎస్‌ జగన్‌ను కలిసి.. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీకి రాజీనామా చేసిన మరునాడే మరో కీలకమైన నాయకుడు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్‌కు స్థానికంగా మంచి పేరు ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా  గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆయన టీడీపీలో చేరి.. అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. తాజాగా చంద్రబాబు పరిపాలన, టీడీపీ తీరుతో విసిగిపోయిన ఆయన.. పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పదవులు వీడిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటామన్న వైఎస్‌ జగన్‌ ఉన్నత ఆశయాన్ని గౌరవిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు