పర్యవసానాలపై అవగాహన ఉండాలి

23 Jun, 2020 06:40 IST|Sakshi

న్యూఢిల్లీ: గల్వాన్‌ ఘటన, తదనంతర పరిణామాలపై ప్రభుత్వం, ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి మాటలు.. చైనా తన చర్యలను సమర్ధించు కునేందుకు ఉపయోగపడేలా ఉండవద్దని మాజీ ప్రధాని మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. అత్యంత బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తన వ్యాఖ్యల పర్యవసానాలపై కచ్చితంగా అవగాహన ఉండాలన్నారు. ‘దేశానికి నాయకత్వం వహిస్తున్న వారిపై పవిత్రమైన బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యత ప్రధానిపై ఉంటుంది’ అన్నారు.

‘దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది దౌత్య నీతికి, సమర్ధ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాబోదు’ అని తేల్చిచెప్పారు. ‘చైనా భారత భూభాగంలో అడుగుపెట్టలేదు. భారత పోస్ట్‌లను స్వాధీనం చేసుకోలేదు’ అని ఇటీవల అఖిలపక్ష భేటీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై మన్మోహన్‌ పై విధంగా స్పందించారు.సరిహద్దుల రక్షణలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు సరైన న్యా యం జరగాలని పేర్కొన్నారు. ‘అందులో ఏమా త్రం లోపం జరిగినా అది ప్రజల విశ్వాసాలకు చేసిన చరిత్రాత్మక ద్రోహం అవుతుంది’ అన్నారు.

మరిన్ని వార్తలు