ఎన్‌జీటీ తీర్పు.. ఇసుక మాఫియాకు చెంపపెట్టు 

5 Apr, 2019 08:01 IST|Sakshi
సీఎం నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణాలో అక్రమ తవ్వకాలు

సాక్షి, అమరావతి : ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు అక్షింతలు వేసినా... జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చీవాట్లు పెట్టినా.. గత అయిదేళ్లలో చంద్రబాబు సర్కారు కనీసం స్పందించలేదు. సొంత జిల్లా చిత్తూరులో ఇసుక మాఫియా ఆగడాలకు నిరసనగా ధర్నాకు దిగిన పాపానికి అమాయకులను నిర్ధాక్షిణ్యంగా లారీలతో తొక్కించి చంపేసిన ఇసుక మాఫియాపై చర్యలు శూన్యం. ఏ వ్యవస్థలు ఏమి చెప్పినా, ఎవరికి నష్టం జరిగినా.. ఎవరి ప్రాణాలు గాలిలో కలుస్తున్నా.. ఇసుక దందాకు అవరోధం కలిగించరాదన్నది చంద్రబాబు అండ్‌ కో దృఢ నిర్ణయం.

గత అయిదేళ్లలో మొదట డ్వాక్రాను అడ్డుపెట్టుకుని.. తర్వాత ఉచితం ముసుగులో.. నదులు, వాగులు, వంకలను తవ్వేసి పచ్చదండు రూ.12,500 కోట్లకుపైగా దండుకుంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) గురువారం రూ.వంద కోట్ల జరిమానా విధించడం ఇసుకు మాఫియాకు చెంపపెట్టులాంటిది.

 రాష్ట్రంలో టీడీపీ నాయకులు ఇసుక స్మగ్లర్లుగా మారి.. ప్రభుత్వ ‘పెద్ద’ దన్నుతో జీవనదులను విధ్వంసం చేస్తున్న తీరుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) గురువారం ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిది. ఇసుక స్మగ్లర్ల ఆగడాలకు అడ్డకట్ట వేయకపోవడంపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై రూ.వంద కోట్లు జరిమానా విధించడం చంద్రబాబు సర్కారును ఇరకాటంలో పడేసింది.

విజయవాడకు సమీపంలో ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలోనే.. అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తుండటాన్ని ఆపేయాలని ఫిబ్రవరి 23, 2017న రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌జీటీ నోటీసు జారీ చేసింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో ఎన్‌జీటీ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక తవ్వకాన్ని ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

అక్రమాల నిగ్గుతేల్చిన కమిషన్‌
ఇసుక అక్రమ రవాణాపై పలుమార్లు నోటీసులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దాంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ఒక కమిషన్‌ను ఎన్‌జీటీ ఏర్పాటు చేసింది. ఎన్‌జీటీ న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ కమిషన్‌లో సభ్యులు. ఈ కమిషన్‌ కృష్ణా నదీలో.. ప్రధానంగా సీఎం చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న కట్టడానికి కూత వేటు దూరంలో ఉన్న ఇసుక రీచ్‌లను తనిఖీ చేశారు. నదీ గర్భంలోకి భారీ ప్రొక్లెయిన్‌లను దించి.. 25 మీటర్ల లోతున నదిని తవ్వేసి.. రోజుకు 2,500 లారీల చొప్పున ఇసుకను తరలిస్తున్నట్లు కమిషన్‌ తేల్చింది.

పది టైర్ల లారీ 21 టన్నుల ఇసుక తరలించాల్సి ఉండగా.. 30 నుంచి 40 టన్నులను రవాణా చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. దిగువన అడ్డగోలుగా ఇసుక తవ్వేయడం వల్ల బ్యారేజీకి పెను ముప్పు తప్పదని కమిషన్‌ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదికను పరిశీలించిన ఎన్‌జీటీ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలంటూ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగించి.. పర్యావరణాన్ని విధ్వంసం చేసినందుకు ప్రతిగా సర్కార్‌కు రూ.వంద కోట్ల జరిమానా విధించింది.  

పర్యావరణవేత్తల ఆందోళన

ఆక్రమణలకు గురైన కృష్ణా తీరాన్ని పరిశీలిస్తున్న రాజేంద్ర సింగ్‌ (ఫైల్‌) 

ప్రభుత్వ పెద్దలకు ఇసుక స్మగ్లర్ల నుంచి క్రమం తప్పకుండా వాటాలు అందడం వల్లే.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డకట్ట వేయలేకపోయారని అధికారులు అంటున్నారు. రాజమండ్రిలో ధవళేశ్వరం బ్యారేజీలో పూడిక(డ్రెడ్జింగ్‌) తీసి.. నిల్వ చేసిన ఇసుకను ఓ టీడీపీ ఎమ్మెల్యే యథేచ్ఛగా అక్రమ రవాణా చేసి అమ్మేసుకోవడంపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైన తమపై సీఎం చంద్రబాబు చీవాట్లు పెట్టారని జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతుండటం వాటికి బలం చేకూర్చుతోంది.

కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుక స్మగ్లర్లు అడ్డగోలుగా ఇసుక తవ్వేయడం వల్ల.. వర్షాకాలం ముగిశాక ఆ నదుల్లో వచ్చే సహజసిద్ధమైన ప్రవాహాలు ఆగిపోయాయని.. భూగర్భ జలమట్టం కూడా తగ్గిపోయిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ
ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో 22 అక్రమ కట్టడాలు ఉన్నాయి. అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే వాటిని కూల్చివేస్తామని చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా హంగామా చేశారు. మంత్రి దేవినేని ఉమా నదిలో పడవపై వెళ్లి సర్వే చేసి.. అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి నోటీసులు ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని రోజులకే ఆ అక్రమ కట్టడాల్లో ఒకటైన లింగమనేని అతిథిగృహాన్ని సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ఇదే అదునుగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్‌ ఎమ్మెల్యే తన సోదరుడిని ముందు పెట్టి సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలో.. కృష్ణా నదీ గర్భాన్ని ఇష్టారాజ్యాంగా తవ్వేస్తూ భారీఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ఇసుక రీచ్‌లకు ఎగువన గుంటూరు జిల్లాకు చెందిన మరో టీడీపీ కీలక ఎమ్మెల్యే.. ఆరు చోట్ల కృష్ణా నదీ గర్భాన్ని తవ్వేస్తూ భారీ ఎత్తున ఇసుకను తరలిస్తూ వందలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. 

మెగసెసే అవార్డు గ్రహీత సూచించినా ససేమిరా
జల పరిరక్షణ ఉద్యమ నేత, వాటర్‌ మ్యాన్, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ అనేక సందర్భాల్లో జీవనదులను విధ్వంసం చేయడాన్ని తప్పుపడుతూ.. వాటికి అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. కానీ స్పందించకపోవడంతో రాజధాని ప్రాంతానికి చెందిన రైతు అనుమోలు గాంధీతో కలిసి ఎన్‌జీటీలో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆగస్టు 2, 2017న కృష్ణా నదీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. అక్రమ నివాసాన్ని తక్షణమే ఖాళీ చేయాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. కానీ.. చంద్రబాబు స్పందించలేదు,  సరికదా ఇసుక స్మగ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచారు.  

అధికారం దక్కిందే తడవుగా ఇసుక దోపిడీకి స్కెచ్‌
2014లో అధికారంలోకి  వచ్చీరాగానే ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కొందరు టీడీపీ నాయకుల కన్ను ఇసుకపైనే పడింది. అందుకే ఇసుక రేవులను డ్వాక్రా మహిళలకు అప్పగించి వారిని లక్షాధికారులను చేస్తామని సీఎం ప్రకటించారు. ఈమేరకు ఇసుక విధానాన్ని సవరించారు. బాబు మాటలు విని డ్వాక్రా మహిళలు తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. కానీ డ్వాక్రా సంఘాలను ముందు పెట్టి టీడీపీ నాయకులు తమ బంధువులు, అనుచరులతో ఇసుక వ్యాపారానికి తెరలేపారు.

దండుకున్న మేరకు దండుకున్న తర్వాత డ్వాక్రా సంఘాలు బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యాయంటూ.. మహిళలపై వైఫల్యం ముద్ర వేసి ఉచిత ఇసుక విధానం తెరపైకి తెచ్చారు. ఉచితం పేరుకే. సాగుతున్నవన్నీ అమ్మకాలే. టీడీపీ నాయకులే ట్రాన్సుపోర్టర్ల అవతారం ఎత్తారు. ఎవరు ఇసుక కావాలన్నా వారినే సంప్రదించాల్సిన∙పరిస్థితులు సృష్టించారు. ప్రాంతాన్ని బట్టి ఇసుక లారీ రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకూ అమ్ముతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో నేనే రాజు నేనే మంత్రి అని చెప్పుకునే ఒక మంత్రి ఇసుక దందా ద్వారా భారీగా దండుకున్నారు. అనంతపురంలో నలుగురు ముఖ్య నాయకులు ఇసుక, భూదందాల ద్వారా వేలకోట్లు దోచుకున్నారు. చిత్తూరు, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల్లో చాలామంది నాయకులది ఇదే పని.  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రులు వెనుకుండి ఇసుక తవ్వకాలు జరిపిస్తూ రవాణా చేయిస్తున్నారు.  

నిబంధనలకు పాతర
నదులు, వాగులు, వంకల్లో మీటరు లోతు మించి ఇసుకను తవ్వరాదని నిబంధనలు ఉన్నాయి. రహదారులు, వంతెనలకు వంద మీటర్ల వరకూ ఇసుక తవ్వరాదు. యంత్రాలతో ఇసుక తవ్వరాదు. ఇలా తవ్వితే రోడ్లు, వంతెనల మనుగడకు ముప్పు. అయితే గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా, చిత్రావతి, తుంగభద్ర, ఇలా ఏ నదిలో చూసినా 10 నుంచి 20 అడుగుల లోతు వరకూ గుంతలున్నాయి. నిబంధనలకు పాతరేసి ప్రొక్లెయిన్లతో బావుల్లా నదులను తవ్వేస్తున్న దృశ్యాలు నిత్యం ఏ నది వద్దకు వెళ్లినా కనిపిస్తున్నాయి.

నెల్లూరు, కర్నూలు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాకాలంలో నదుల్లో కొద్దిగా నీరున్నప్పుడు ఈతకు వెళ్లి ఈ గోతులున్నది తెలియక వీటిలో చిక్కుకుని పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ఇసుక మాఫికా చేసిన హత్యలని చెప్పక తప్పదు. రాష్ట్రంలోని 500 ఇసుక రేవులు ఉన్నాయి. ఇవి కాకుండా రహదారులకు దగ్గరలో నదుల్లోకి దారి ఏర్పాటు చేసి మాఫియా గ్యాంగులు మరికొన్ని అనధికారిక రేవులను తయారు చేసుకున్నాయి.  

బాబు చెప్పిందేమిటి? చేసిందేమిటి? 
అక్రమ తవ్వకాల ద్వారా తనకు కమీషన్లు ముట్టాలని, పార్టీ నాయకులు భారీగా సంపాదించుకుని ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి ఉపయోగించుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. అందుకే ఆయన డ్వాక్రా సంఘాలను ఫెయిల్‌ చేయించారు. ప్రతి రీచ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సీఎం మొదట  ప్రకటించారు. ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు అమర్చుతామన్నారు. ఒక్కటంటే ఒక్క రేవులో కూడా సీసీకెమెరాలు అమర్చలేదు. జీపీఎస్‌ పరికరాల అమరిక మాటా నీటి మూటే.  జీపీఎస్‌ పరికరాలు అమర్చితే ఏయే వాహనం ఎక్కడెక్కడకు ఇసుక రవాణా చేసిందో తెలిసిపోతుంది.  దీనివల్ల అక్రమాలకు అవకాశం ఉండదు. అందువల్లే ఇలా చేయడానికి సీఎం ఒప్పుకోలేదు. 

నదులను చెరబట్టిన అధికార పార్టీ నేతలు
అధికార పార్టీ నేతలు కృష్ణా, గోదావరి, వంశధార, బాహుదా, పెన్నా, చిత్రావతి, తుంగభద్ర వంటి నదులను చెరబట్టి.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి.. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాలకు తరలించి వేలాది కోట్ల రూపాయాలు దోచుకున్నారు.  ఆ క్రమంలో జీవ నదులను ధ్వంసం చేశారు. పర్యావరణానికి తూట్లు పొడిచారు.  ఇదే రీతిలో తమ్మిలేరును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దోచేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డంగించిన తహసిల్దార్‌ వనజాక్షిని చింతమనేని జుట్టపట్టి ఈడ్చిపారేసి దాడి చేశారు.

అమానుషంగా వ్యవహరించిన ఎమ్మెల్యే చింతమనేనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సీఎం చంద్రబాబు తద్భిన్నంగా ఆయనకు ‘విప్‌’గా పదోన్నతి కల్పించి.. ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు ఇచ్చి బాసటగా నిలిచారు.. ఇసుక స్మగ్లర్లకు చంద్రబాబు వెన్నుదన్నుగా నిలిచారనడానికి ఇదే తార్కాణం.  అనంతపురం జిల్లాలో తమ లారీలను పట్టుకున్నందుకు ఒక మంత్రి నుంచి పోలీసులు ఎదుర్కొన్న అవమానాలే నిదర్శనాలు. ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే.  
 

మరిన్ని వార్తలు