తెలంగాణ బీజేపీ నేతలపై నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం

23 Apr, 2020 20:02 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ నేతల తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఏ ప్రాజెక్టుకైనా కేంద్రం నుండి మూడు రూపాయలైనా తెచ్చారా అంటూ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడున్నరేళ్లలో కాళేశ్వరం నిర్మించారని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశారని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు చేపట్టారని, బీజేపీ నేతలు కేంద్రంలోని తమ ప్రభుత్వంతో పోరాడి సాధించిన ఒక్క పనైనా చూపాలని సవాల్‌ విసిరారు మద్దతు ధరపై కొనుగోలు కోటా పెంచాలని పదే పదే కేంద్రాన్ని కోరుతున్నది బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. ( అద్దెదారులకు ఊరట.. )

 బీజేపీ నేతలు పసుపు బోర్డు కోసమో, పసుపుకు మద్దతు ధర కోసమో, కాళేశ్వరానికి జాతీయ హోదా కోసమో, రాష్ట్రానికి నిధుల కోసమో, పంటల మద్దతు ధర కోటా పెంపు కోసమో దీక్షలు చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారని అన్నారు. ప్రచారం కోసం, అధిష్టానం మెప్పుకోసం తెలంగాణ బీజేపీ నేతలు కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం దీక్షలు చేయాలని సూచించారు. రైతే తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమన్నారు. దేశంలో 30 వేల కోట్లతో పంటలు కొంటున్న రాష్ట్రం ఏదన్నా ఉందా అని ప్రశ్నించారు. ( రెండు రాష్ట్రాలకు పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి )

కరోనా విపత్కర పరిస్థితులలో కూడా రైతుల చేతికష్టం మట్టిపాలు కాకూడదని గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు తెరిచి పంటను కొంటున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4996 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,08, 5237 మెట్రిక్ టన్నుల ధాన్యం, 935 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,89,353.90 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 84 కొనుగోలు కేంద్రాల ద్వారా 56,019.6 మెట్రిక్ టన్నుల పప్పుశనగ, 11 కేంద్రాల ద్వారా 2803.7 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోలు చేశారని వెల్లడించారు. అవసరాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు