విద్యుత్‌ సరఫరాలో నంబర్‌వన్‌  

19 May, 2018 13:16 IST|Sakshi
రైతులకు చెక్కులు అందజేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

బి.చందుపట్లలో రైతుబంధు చెక్కుల పంపిణీ

చివ్వెంల(సూర్యాపేట) : 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయడంలో దేశంలోనే తొలిరాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి  మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలో నిర్వహించిన రైతుబంధు కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 60 ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వం సాధించని ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిందని పేర్కొన్నారు.

రైతుల అభివృద్ది కోసం, రైతులను రారాజులుగా చూడాలనే లక్ష్యంతో  సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. ఇప్పటికే రైతురుణమాఫీ పథకం ప్రవేశ పెట్టిన రైతులు రుణ గ్రహితలు కాకూడదని, దాని కోసం పంట పెట్టుబడి పథకం ప్రవేశపెట్టాలనే నిర్ణయంతో ఎకరాకు రూ.4వేలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నాటి ప్రభుత్వంలో రైతు ప్రతి దానికి అప్పులు చేసేవారని అటువంటి సమస్య ఇకా ఉండబోదన్నారు.

వచ్చే సంంవత్సరం నాటికి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు పూర్తి అయి కోటి ఎకరాలకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆంధ్రాకు పెట్టుబడి పెడుతుంటే మాట్లాడని ఉత్తమ్, జానారెడ్డిలు ఓట్ల కోసం ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్ల కోసం వస్తే వాళ్లకు వాతలు పెట్టడానికి గ్రామాల్లో రైతులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

సూర్యాపేటలో గత 20 సంవత్సరాలుగా ఉన్న రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు తనను ఎన్నుకున్నారన్నారు. ఇప్పటికే నియోజక వర్గంలో ప్రతి గ్రామానికి రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈసందర్భంగా పలువురు రైతులకు చెక్కులు అందజేశారు. అంతకు ముందు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్దే ధ్యేయంగా  పాలన చేస్తుందని, అది చూసి ఓర్వలేకనే ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.

ఈసందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 200 మంది పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో ఆర్‌డీఓ మోహన్‌రావు, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ భాషా, మారినేని సుధీర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వై.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ శాఖ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్,  మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, నాయకులు సుంకరబోయిన శ్రీనివాస్‌ యాదవ్, జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, చందుపట్ల పదయ్య, కొణతం అప్పిరెడ్డి. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ భుక్యా వెంకటేశ్వర్లు, ఎఓ ఆశాకుమారి, సర్పంచ్‌ రతీరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు