చిచ్చు రేపొద్దు!

11 Jan, 2020 08:19 IST|Sakshi

చంద్రబాబుకు మేధావుల సూటి ప్రశ్న

సాక్షి, తిరుపతి:  తమ అనుచరుల ప్రయోజనాల కోసం రెండు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య చిచ్చు రేపడానికి టీడీపీ రాజకీయం చేస్తోందని జిల్లాకు చెందిన పలువురు మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు తిరుపతిలో అమరావతికి మద్దతుగా తన మందీ మార్బలంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారని మండిపడుతున్నారు. జిల్లా ప్రజల దాహార్తి తీర్చాలంటే కండలేరు జలాశయం నుంచి నీటిని తరలించాలి. ఆ ప్రయత్నానికి కూడా చంద్రబాబుగండికొట్టారు. కండలేరు నుంచి నీటిని తీసుకొచ్చి ఉంటే జిల్లాలో సాగు, తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేది.

అటువంటి బృహత్తర పథకానికి చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు టెండర్లు ఖరారుఅయ్యాక వాటిని నిర్దాక్షిణ్యంగా రద్దుచేయించిన విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తుచేస్తున్నారు. గాలేరు–నగరి కాలువను పూర్తిచేసే అవకాశం ఉన్నా ‘అమరావతి.. అమరావతి’ అంటూ ఐదేళ్లు కాలయాపన చేసి వదిలేశారని ఆయనపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాకు వచ్చిన ప్రతిష్టాత్మకమైన మన్నవరం ప్రాజెక్టును తరలించుకెళ్తున్నా.. చూసీచూడనట్లు వ్యవహరించిన ఘనత చంద్రబాబుకే దక్కిందంటున్నారు. పాడి రైతులకు కల్పవృక్షం లాంటి విజయా డెయిరీని, జిల్లాలో ఉన్న రెండు సహకార చక్కెర పరిశ్రమలను కూడా మూయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి వచ్చిన కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను అమరావతికి తరలించిన చంద్రబాబుపై వైద్య విద్యార్థులు, రోగులు శాపనార్థాలు పెడుతున్నారు. చిత్తూరు సమీపంలో సీఎంసీ కళాశాల ఏర్పాటుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెయ్యి ఎకరాలు కేటాయిస్తే.. చంద్రబాబు సీఎం అయ్యాక అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేస్తున్నారు.

మూడు రాజధానులే ముద్దు
విజన్‌ 2020 అంటే భ్రమరావతి. జగన్‌ విజన్‌ అంటే.. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌. రాయలసీమకు హైకోర్టు అయినా ఇచ్చి కలుపుకుపోదాం అన్న కనీస సానుభూతి చంద్రబాబుకు లేదు. అమరావతి కోసం సీమ ప్రజలు ఎందుకు పోరాటాలు చేయాలి. వారి కోసం విశాఖ ప్రజలను రాయలసీమ ప్రజలు దూరం చేసుకోవాల్సిన అవసరం ఏముంది. రాయలసీమకు హైకోర్టు కావాలి అన్న డిమాండుకు ఏరోజూ ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాయలసీమ ప్రయోజనాలకు ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు పేచీ కూడా లేదు. కానీ రాజధాని, నీళ్లు విషయంలో అమరావతితో కూడిన కృష్ణా డెల్టాతో నిత్యం సమస్య ఉంది.      –ఎర్రి దేవరాజులురెడ్డి, వ్యాపారవేత్త, తిరుపతి.

చంద్రబాబుకు యాత్ర చేసే అర్హత లేదు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తిరుపతిలో సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట యాత్ర చేసే అర్హత లేదు. చిత్తూరు జిల్లాలో జన్మించి, ఇక్కడే రాజకీయంగా పైకి వచ్చిన ఆయన జిల్లాకు ఏమీ చేయలేదు. తన బంధువులు, తన సామాజిక వర్గం కోసమే అమరావతిలో రాజధాని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  అభివృద్ధి, పాలన వికేంద్రీకణకు పాటుపడుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుంది. జిల్లాకు ఆయన ఏమీ చేశారో ప్రజలకు చెప్పి ఆ తర్వాత యాత్ర చేసుకోవాలి. చంద్రబాబు రాయలసీమలో ఎందుకు రాజధాని ఏర్పాటు చేయలేదని ప్రజలు ప్రశ్నించాలి.– డాక్టర్‌ అగరాల ఈశ్వర రెడ్డి, శాసన సభ మాజీ స్పీకర్‌

జిల్లా వాసులకు వివరణ ఇవ్వాలి
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ప్రజలకు వివరణ ఇచ్చి తిరుపతిలో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం చేసుకోవాలి. సేవ్‌ ఆంధ్రప్రదేశ్, సేవ్‌ అమరావతి.. పేరుతో ఆందోళన చేసే హక్కు ఆయనకు లేదు. జిల్లా అభివృద్ధిని ఫణంగా పెట్టినందుకు ఆయన వివరణ ఇవ్వాలి. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతి తరలించవద్దనే చంద్రబాబు మాజీ కేంద్రమంత్రి శంకుస్థాపన చేసిన కేన్సర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఎందుకు అమరావతికి తరలించారు? పద్మావతి మెడికల్‌ కళాశాలలో 120 జీఓ తెచ్చి రాయలసీమవాసులకు అన్యాయం చేశారు. విద్యార్థులు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. మాజీ ప్రధాని శంకుస్థాపన చేసిన మన్నవరం భెల్‌ను తరలించారు. కండలేరు సాగునీటి ప్రాజెక్టును నెల్లూరుకు తరలించారు. ఎన్‌టీఆర్‌ శంకుస్థాపన చేసిన గాలేరు–నగరిని ఎందుకు కొనసాగించలేదు. వైఎస్సార్‌ ఏర్పాటుచేసిన శ్రీసిటీని ఎందుకు నెల్లూరుకు తరలించారు. కృష్ణ పుష్కరాల పేరిట రూ. 7 కోట్ల టీటీడీ నిధులను అమరావతికి తరలించారు. అదే శ్రీశైలంలో కృష్ణ పుష్కరాలకు ఎందుకు నిధులు ఇవ్వలేదు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి చంద్రబాబు తిరుపతిలో అడుగుపెట్టాలి.     –ఎం. పురుషోత్తం రెడ్డి,    రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌

>
మరిన్ని వార్తలు