సాగు ఖర్చులన్నీ పెట్టుబడి కిందకే..

18 Mar, 2018 02:17 IST|Sakshi
‘కృషి ఉన్నతి మేళా’లో ఏర్పాటైన ఓ స్టాల్‌ను పరిశీలిస్తున్న మోదీ

దానికి ఒకటిన్నర రెట్లు ఉండేలా మద్దతు ధరను నిర్ణయిస్తాం

ప్రతిపక్షాలు కావాలని గందరగోళం సృష్టిస్తున్నాయి

ఢిల్లీలో కృషి ఉన్నతి మేళాలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పంట పెట్టుబడి కంటే మద్దతు ధర కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా చేస్తామన్న తమ ప్రభుత్వ హామీపై ప్రతిపక్ష పార్టీల నేతలు కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. పంట పండించడానికి అయ్యే అన్ని ప్రధాన ఖర్చులనూ పెట్టుబడి కింద లెక్కలోకి తీసుకుంటామని ఆయన భరోసానిచ్చారు. మూడు రోజులపాటు ఢిల్లీలో జరుగుతున్న వ్యవసాయ సదస్సు ‘కృషి ఉన్నతి మేళా–2018’ని మోదీ శనివారం సందర్శించి అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టకుండా కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడాలన్నారు.

‘మద్దతు ధర పెట్టుబడి కంటే కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా చూస్తామని 2018–19 బడ్జెట్‌లో హామీనిచ్చాం. పెట్టుబడి కిందకు ఏయే ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారో స్పష్టత లేదంటూ కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు. కౌలు డబ్బు, మూలధనంగా తీసుకొచ్చిన డబ్బుకు అయ్యే వడ్డీ, విత్తనాలు, ఎరువులు, రైతు కుటుంబం శారీరక శ్రమకు పరిహారం, కూలీలు, సొంత లేదా అద్దెకు తెచ్చుకున్న ట్రాక్టర్ల వంటి యంత్రాలు, ఎద్దులు, సాగునీటికి అయ్యే ఖర్చు, ప్రభుత్వానికి చెల్లించే డబ్బు తదితరాలన్నింటినీ పెట్టుబడి కింద పరిగణిస్తాం.

దీనికి కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా మద్దతు ధరను నిర్ణయిస్తాం’ అని మోదీ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మండీలను వ్యవసాయ మార్కెట్‌ కమిటీలతో అనుసంధానించేందుకు కృషి చేస్తున్నామనీ, పల్లెల్లోని 22 వేల సంతల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని ఇదివరకే బడ్జెట్‌లో పేర్కొన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవో) ద్వారా రైతులు తమ పంటను మరింత మెరుగైన పద్ధతుల్లో విక్రయించి అధిక ఆదాయాన్ని పొందొచ్చని మోదీ సూచించారు.

సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం ‘జైవిక్‌ ఖేతీ’ అనే ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కూడా ఆయన ప్రారంభించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనీ, ఆ దిశగా చకచకా అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఎన్నో ఆదర్శ చట్టాలను రూపొందించిందనీ, వాటిని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన కోరారు. కృషి ఉన్నతి మేళాలో దాదాపు 800 స్టాళ్లు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులు, నూతన విధానాలపై అవగాహన కల్పించారు. ఆదివారంతో ఈ కార్యక్రమం ముగియనుంది.

ఉపయోగమో కాదో చూడండి
కృషి ఉన్నతి మేళా వంటి అవగాహన కార్యక్రమాలు రైతులకు ఏ మేరకు మేలు చేస్తున్నాయో పరిశీలించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ను మోదీ కోరారు. ఆధునిక వ్యవసాయ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను రైతుల వద్దకు చేర్చాలంటే ఇలాంటి మేళాలను మారుమూల ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అవగాహన సదస్సుల్లో్ల రైతులు కొత్త పద్ధతులను క్షుణ్నంగా తెలుసుకోవాలని మోదీ సూచించారు. ఢిల్లీలో కృషి ఉన్నతి మేళాను సందర్శించేందుకు వేలాది మంది రైతులు తరలివస్తున్నారు.
 

మరిన్ని వార్తలు