కోట్ల మెదళ్లను కదిలించిన ఒక్క గళం | Sakshi
Sakshi News home page

కోట్ల మెదళ్లను కదిలించిన ఒక్క గళం

Published Sun, Mar 18 2018 2:14 AM

YSRCP Chief Ys Jagan always fight for AP Special Status - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా... ఐదు కోట్ల మంది ఆకాంక్ష. ఆంధ్రప్రజల హక్కు. అది పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి లభించిన హామీ. సాక్షాత్తూ దేశ ప్రధాని ఇచ్చిన మాట. దానిని ఈ రాష్ట్రప్రభుత్వం ‘ఉద్దేశపూర్వకంగా’ మరచిపోయిన రోజున.. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని రోజున.. విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఒకే ఒక్క గళం డిమాండ్‌ చేసింది. ‘ప్యాకేజీలతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మా హక్కు’ అని అది నినదించింది. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరవని, రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, పక్క రాష్ట్రాలతో పోటీ పడలేదని ఒకే ఒక్క గొంతు ప్రజల్లో చైతన్యం కలిగించింది. అది మరెవరో కాదు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇపుడు కోట్ల గొంతులు ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నాయి. అనేక పార్టీలు జాతీయ స్థాయిలో కూడా ఒకే తాటిపైకి వస్తూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టాలని చూసినా.. ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అందుకు కారణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా చేస్తున్న  దీక్షలు, పోరాటాలేనన్నది నిర్వివాదాంశం.

హోదాను సజీవంగా ఉంచిన పోరాటం..
ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వాలు రాగానే.... ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదు.. అదేమీ సంజీవని కాదు అంటూ రాష్ట్ర ప్రభుత్వాధినేత ప్రచారం చేస్తున్న సందర్భం.. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘం అడ్డు చెబుతోందని, హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యం.. ప్రత్యేక హోదా అవసరం లేదంటూ దానిని మరుగున పరిచేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న సమయం.. ఇక ప్రత్యేక హోదాకు ఎలాంటి అవకాశాలూ లేవన్న భావనలు పెరుగుతున్న తరుణంలో ప్రత్యేక హోదా సంజీవనే అని ఒకే ఒక్కరు గట్టిగా నిలబడ్డారు. హైదరాబాద్‌ లేని ఆంధ్రప్రదేశ్‌ పొరుగు రాష్ట్రాలతో పోటీపడ లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఉంటేనే రాయితీ లు చూసి ఏపీకి పరిశ్రమలు తరలి వస్తాయని, నోవేకెన్సీ బోర్డులు కాకుండా అన్నీ వేకెన్సీ బోర్డులే కనిపిస్తాయని, యువతకు ఉద్యోగ ఉపాథి అవకాశాలు మెరుగుపడతాయని, ఐదు కోట్ల మంది భవితవ్యానికి అదొక్కటే మార్గమని జగన్‌ గట్టిగా విశ్వసించారు.

రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతకు, ప్రజలకు వీటి గురించే వివరించారు. వందల కోట్లు వెచ్చించి పరిశ్రమల కోసం భాగస్వామ్య సదస్సులు నిర్వహించనక్కరలేదని, ప్రత్యేక విమానాలలో దేశదేశాలు తిరిగి దేబిరించనక్కరలేదని, హోదా ఉంటే పరిశ్రమలే రాష్ట్రానికి తరలివస్తాయని జగన్‌ విడమరిచి చెప్పారు. హోదా కోసం జగన్‌ చేయని పోరాటం లేదు. నాలుగేళ్లుగా అటు పార్లమెంటులోనూ వెలుపలా.. ఇటు ప్రజా క్షేత్రంలోనూ అవిశ్రాంతంగా  పోరాటం జరిగేలా చూశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలి పార్లమెంటు సమావేశాలలోనే 2014, జూన్‌ 12న ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని వైఎస్సార్సీపీ కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఆనాటి నుంచి నేటి వరకు అనేక రూపాలలో జగన్‌ పోరాడుతూ వస్తున్నారు. ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ల ముట్టడి, రాష్ట్ర బంద్‌లు నిర్వహించారు. చివరకు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని పలు విజ్ఞాపనలు అందించారు. ఊరూవాడా తిరిగారు.

యువభేరి సదస్సులు నిర్వహించి యువతలో చైతన్యం రగిలించారు. యువభేరి సదస్సులకు వేదికలు లేకుండా చేయడానికి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. కళాశాలల సమీపానికే రానీయకుండా ఆంక్షలు విధించింది. జగన్‌ సభలకు వెళితే జైలుకే నని బెదిరించింది. హోదా ఉద్యమాలలో పాల్గొంటే పీడీ యాక్టు ప్రయోగిస్తామని యువకులను హెచ్చరించింది. అయినా నిర్బంధం పెరిగే కొద్దీ యువతలో పట్టుదల పెరిగింది. జగన్‌ చెప్పే విషయాలను వినడానికి వెల్లువలా తరలివచ్చారు. ఆయన చెబుతున్న అంశాలను శ్రద్ధగా ఆకళింపు చేసుకున్నారు. హోదాతో రాష్ట్రానికి ఏఏ మేళ్లు జరుగుతాయో యువభేరి సదస్సులలో  జగన్‌ విపులంగా వివరించారు. ఏఏ రాయితీలు వస్తాయో.. వాటి వల్ల ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు ఎలా తరలి వస్తాయో.. లక్షల కొద్దీ ఉద్యోగ ఉపాథి అవకాశాలు ఎలా వస్తాయో చెప్పారు. అటు పోరాటాలు ఇటు యువభేరి సదస్సులతో జగన్‌ ప్రజలను అనునిత్యం చైతన్య పరుస్తూ హోదా భావన సజీవంగా ఉండేలా చేశారు. జగన్‌  ప్రయత్నాల వల్ల, అన్నీ అర్ధమయ్యేలా వివరించినందు వల్ల హోదా తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదని ప్రజలు గ్రహించారు. అందువల్లే హోదా తప్ప ఇంకేమీ అవసరం లేదని ప్రజలు నినదిస్తున్నారు. 

ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి పూటకోమాట.. 
చంద్రబాబు కమిషన్లకు కక్కుర్తిపడో.. ఓటుకు కోట్లు కేసుకు భయపడో.. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేదు. నాలుగేళ్లు కాలయాపన చేశారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. హోదా సంజీవని కాదన్నారు. దానికి సమానంగా కేంద్రం ప్యాకేజీ ఇస్తుంటే తీసుకోవద్దా అన్నారు. హోదా అంటే జైలుకే అని బెదిరించారు. మనమే ఎక్కువ సాధించాం ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ నిధులు వచ్చాయా అన్నారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేయించారు.ప్రజలలో పెరుగుతున్న భావోద్వేగాలను గమనించి యూటర్న్‌ తీసుకున్నారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం పెడదామని ప్రతిపక్షనేత పిలుపునిచ్చినపుడు గానీ,  ఏపీ ఎంపీలంతా ఒక్కతాటిపైకి వచ్చి రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని ప్రతిపాదించినపుడు గానీ బాబు స్పందించలేదు. పైగా అవహేళన చేశారు.  సరిపడా సంఖ్యాబలం ఉంటే తాము కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామన్నారు. కానీ తెల్లారే సరికల్లా మళ్లీ యూ టర్న్‌ తీసుకున్నారు. 

జగన్‌ వల్లే జాతీయ స్థాయిలోనూ కదలిక
ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పలుమార్లు పలు విషయాలపైన చంద్రబాబు నాయుడు మాటలు మార్చుతున్నా... ప్రత్యేక హోదా విషయంలో నిలకడగా నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పోరాటం వల్లే ఇపుడు జాతీయ స్థాయిలోనూ కదలిక వచ్చింది. ప్రత్యేక హోదా అనే ఒక లక్ష్యం కోసం ప్రజలను అనునిత్యం చైతన్యపరచడమే కాక జాతీయస్థాయిలో రాజకీయ పక్షాలను ఏకం చేసి కేంద్రంలో కూడా కదలిక రావడానికి జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారు. జగన్‌కు నాకు పోలికా.. జగన్‌తో నన్ను పోలుస్తారా అని మీడియాను ఈసడించిన ముఖ్యమంత్రే చివరకు ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ను అనుసరించాల్సి వచ్చిందని విశ్లేషకులంటున్నారు. కొన్ని కోట్ల మెదళ్లను కదిలించారు కాబట్టే జగన్‌ బాటలోకి వచ్చి ప్రత్యేక హోదా కోసం నిలబడక తప్పని పరిస్థితి చంద్రబాబుకు వచ్చిందన్నది నిర్వివాదాంశమని వారు పేర్కొంటున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానమైనా, ఎంపీల రాజీనామాల నిర్ణయమైనా జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగమే. ప్రతిపక్షనేత ప్రజల తరఫున పోరాడుతుంటే..  రాజకీయ ప్రయోజనాల లెక్కలు వేసుకుంటూ ముఖ్యమంత్రి యూటర్న్‌ల పిల్లిమొగ్గలు వేస్తున్నారు.. 

Advertisement
Advertisement