మోదీ పర్యటన.. హై అలర్ట్‌

18 May, 2018 18:02 IST|Sakshi
జమ్ము వద్ద భద్రతా సిబ్బంది.. ఇన్‌సెట్‌లో ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. శనివారం నుంచి ప్రధాని రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనకు కొద్దిగంటల ముందే ఉగ్రదాడి చోటు చేసుకోవటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనికితోడు వేర్పాటు వాదుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

భద్రతా వలయంలో... శ్రీనగర్‌, జమ్ముకు వచ్చిపోయే మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వాహనాలను క్షుణ్ణంగా తరలించాకే అనుమతిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీని నాలుగు రెట్లు ఎక్కువగా మోహరించారు. ప్రధాని పర్యటించే మూడు రీజియన్‌లలో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గురువారం శ్రీ నగర్‌లోని ఓ గార్డ్‌ పోస్టుపై దాడి చేసి ఉగ్రవాదులు ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటనపై అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనకు బాధ్యులిగా ఇద్దరు అధికారులపై వేటు వేసి దర్యాప్తునకు ఆదేశించారు.

వేర్పాటువాదుల నిరసన... మోదీ రాకను వ్యతిరేకిస్తూ వేర్పాటువాదులు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. జేఆర్‌ఎల్‌ ఆధ్వర్యంలో సయ్యద్‌ అలీ షా గిలానీ, మిర్‌వాజీ ఉమర్‌ ఫారూఖ్‌, యాసిన్‌ మాలిక్‌లు తమ గ్రూప్‌ సభ్యులతో మార్చ్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌ దాకా ర్యాలీ ఉంటుందని జేఆర్‌ఎల్‌ ప్రకటించింది. మే 21న రాష్ట్ర బంద్‌కు జేఆర్‌ఎల్‌ పిలుపునిచ్చింది. ఇత్తెహద్‌ అవామీ పార్టీ నల్ల జెండాలతో ఆందోళనకు సిద్ధం కాగా.. పోలీసులు ఆ పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టులు చేశారు. కాగా, తన పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు.

మరిన్ని వార్తలు