‘రాజ్యసభ’రసవత్తరం

11 Mar, 2018 03:06 IST|Sakshi

రాష్ట్రంలో 3 సీట్లకు ఎన్నిక అనివార్యమైతే 23న పోలింగ్‌

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంకటం

కాంగ్రెస్‌ పోటీ ప్రకటనతో కేసీఆర్‌ అప్రమత్తం

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు

టీఆర్‌ఎస్‌కే మజ్లిస్‌ మద్దతు

మిగిలిన పార్టీల వైఖరిపై నెలకొన్న ఆసక్తి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ఖాళీలకు ఎన్నికలు అనివార్యమైతే ఈ నెల 23న పోలింగ్‌ జరగనుంది. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉన్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం మూడు స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే పడనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్నిబట్టి రాజ్యసభ ఎన్నికలు ఇప్పటిదాకా ఏకగ్రీవం కావడం సంప్రదాయంగా వస్తోంది.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు అధికారికంగా 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ నుంచి కలిపి 25 మంది దాకా ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. ఒక్కో అభ్యర్థి గెలవడానికి కనీసం 30 ఓట్లకు తగ్గకుండా రావాలి. సాధారణ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు సొంతంగా గెలుచుకున్న ఎమ్మెల్యేలు ఉంటే పోటీ పెద్ద విషయం కాదు. కానీ రాజ్యసభ ఎన్నికల్లో ప్రత్యేకమైన ఎన్నికల ప్రక్రియ ఉండటం, రాజ్యసభ ఎన్నికలకు పోటీ పెడు తున్నామని కాంగ్రెస్‌ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు.

ఓపెన్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు...
రాజ్యసభకు ఓపెన్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలను నిర్వహిస్తారు. పోలింగ్‌ సందర్భంగా బూత్‌ వద్ద ఉన్న పార్టీల పోలింగ్‌ ఏజెంటుకు ఎమ్మెల్యేలు తాము వేసే ఓటును చూపించాల్సి ఉంటుంది. పార్టీ విప్‌ను ఉల్లంఘించి మరో పార్టీ అభ్యర్థికి వేసే ఓటు చెల్లకపోయే ప్రమాదముంది. పార్టీ విప్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్థూలంగా రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై న్యాయ నిపుణులతో కేసీఆర్‌ లోతుగా చర్చిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తే రాజ్యసభ ఎన్నికల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయనే దానిపై మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల సంకటం...
రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్‌ బ్యాలెట్‌ విధానం ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎక్కువ ఫిరాయింపులు ఉండటం, కాంగ్రెస్‌ పోటీలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ విప్‌ను అనివార్యంగా జారీ చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేల విషయంలోనూ పలు ఇబ్బందులు ఉన్నాయి. టీడీఎల్పీ విలీనం అయినట్టుగా స్పీకర్‌ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అయినా సాంకేతికంగా ఈ విలీనం ప్రకటన చెల్లదని టీడీపీ వాదిస్తోంది.

బీఎస్పీ నుంచి పెద్దగా సాంకేతిక ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. కాకుంటే సీపీఐ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉండే అవకాశముంది. మిగిలిన ఫిరాయింపుదారుల విషయంలో ఇంకా అస్పష్టత నెలకొంది. రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ వైఖరి ఏమిటనేది ఇంకా తేలలేదు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించినా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించినా టీడీపీ తీసుకునే నిర్ణయం కూడా రాజ్యసభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పుడు ఏ పార్టీ ఎవరికి మద్దతు ప్రకటిస్తుందో అనే అంశాన్ని బట్టి భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు కూడా ఉంటాయనేది తేలనుంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని మజ్లిస్‌ ప్రకటించింది. ఏడుగురు ఎమ్మెల్యేల బలమున్న మజ్లిస్‌ ఎమ్మెల్యేల మద్దతు టీఆర్‌ఎస్‌కు ఈ సమయంలో కీలకంగా ఉపయోగపడనుంది.

మరిన్ని వార్తలు