ఆ ఐదూళ్లు తిరిగివ్వండి..! | Sakshi
Sakshi News home page

ఆ ఐదూళ్లు తిరిగివ్వండి..!

Published Sun, Mar 11 2018 3:13 AM

Telangana proposal to Andhra Pradesh on polavaram caved villages - Sakshi

‘మా నుంచి తీసుకున్నఐదూళ్లు తిరిగి ఇవ్వండి’అంటూ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను కోరుతోంది. ఈ ప్రతిపాదనతో కూడిన ఓ విన్నపాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. పోలవరం ముంపు మండలాలుగా పేర్కొంటూ గతంలో ఏపీ డిమాండ్‌తో తెలంగాణ నుంచి విడిపోయిన భూభాగంలోనే ఈ ఐదూళ్లు ఉన్నాయి. ఈ తాజా ప్రతిపాదనకు, ఆ ఏడు మండలాలు తరలిపోయిన వివాదానికి సంబంధం లేదు. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. దేవాలయంతోపాటు భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ గ్రామాల అవసరం వచ్చింది. దీంతో వాటిని తెలంగాణకు తిరిగి కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను కోరింది. 

సాక్షి, హైదరాబాద్‌: భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకోనుంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మాడవీధులు, గాలి గోపురాలు.. పూర్తి కొత్త రూపు ఇవ్వనున్నారు. ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.  

27న శంకుస్థాపన..? 
ఆలయ పునర్నిర్మాణ పనులను ఈ నెల 27న శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా అష్టమి.. నవమి తిథుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇష్టపడరు. ఇలాంటి సెంటిమెంట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా శ్రీరామనవమి మరుసటి రోజు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. 26న జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్‌ భద్రాచలం వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం పట్టాభిషేక మహోత్సవాలను తిలకించి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత కోసం ఉగాది రోజున సీఎంను కలసి చర్చించాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు నిర్ణయించారు. భద్రాచల శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రిక, పోస్టర్‌ను ఇద్దరు మంత్రులు ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. 27న సీఎంతో లేదా ముఖ్యమంత్రి ఆదేశిస్తే చినజీయర్‌స్వామితో శంకుస్థాపన కార్యక్రమం కొనసాగుతుందని మంత్రులు పేర్కొన్నారు. 

ఐదు గ్రామాలను కలుపుకుని అభివృద్ధి.. 
భద్రాచలం పట్టణానికి టెంపుల్‌ టౌన్‌ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. దీనికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయముంది. ఇప్పుడు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందున పనిలోపనిగా టెంపుల్‌ టౌన్‌గా మార్చాలన్న ప్రతిపాదన సీఎం పరిశీలనకు వచ్చింది. అయితే భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్తగా స్థలం అవసరమైతే సేకరించటం కష్టంగా మారింది. భద్రాచలానికి ఓవైపు గోదావరి ఉండగా, మిగతా రెండు వైపులా ఆంధ్రప్రదేశ్‌ భూభాగమే ఉంది. దీంతో ఆ రాష్ట్రం పరిధిలో ఉన్న కొన్ని ఊళ్లను తమకు ఇవ్వాలంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరింది. ఎటపాక, లక్ష్మీపురం, పురుషోత్తమపట్నం, పిచుకలపాడు, కన్నాయి గూడెం గ్రామ పంచాయతీలను తెలంగాణ కోరింది. వీటితోపాటు గుండాల అనే ఆవాస ప్రాంతాన్ని కూడా కోరింది.  

యాదాద్రి తరహాలో చేపడతాం.. 
భద్రాచలం ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. వీటితో పనులు మొదలవుతాయి. భవిష్యత్తులో ఇతర పనులు జోడిస్తే బడ్జెట్‌ పెరుగుతుంది. యాదాద్రి తరహాలో ఎంత ఖర్చయినా సరే పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే ఈ నెల 27నే పనులు మొదలవుతాయి’ 
– మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

Advertisement
Advertisement