టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట

31 Aug, 2018 12:02 IST|Sakshi

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 2న నిర్వహిస్తోన్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది పూజారి శ్రీధర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా సాంఘిక మాధ్యమాల ద్వారా చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిటిషన్‌ ద్వారా కోరారు.

పిటిషన్‌పై మరోసారి విచారించిన హైకోర్టు ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ అడ్వోకేట్‌ జనరల్‌, న్యాయమూర్తికి తెలిపారు. ప్రభుత్వ అడ్వోకేట్‌ జనరల్‌ సమాధానంతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభ జరుపుకోవాలని సూచించారు. ఆ మేరకు ప్రభుత్వ అడ్వోకేట్‌ జనరల్‌ హామీ ఇ‍వ్వడంతో హైకోర్టు, పిటిషన్‌ను కొట్టివేసింది.

మరిన్ని వార్తలు