‘వ్యవసాయానికి 5 శాతం కేటాయింపులా’

18 Jul, 2019 02:11 IST|Sakshi

కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ రేవంత్‌ విమర్శ

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో 55 శాతం మంది జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం 5 శాతం నిధులే బడ్జెట్‌లో కేటాయించడం ఎంతవరకు న్యాయమని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేటా యించిన నిధులను సైతం ఖర్చు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ పద్దులపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రేవంత్‌ మాట్లాడారు. ఢిల్లీ విమానాశ్రయంలో తాను ఒక కథల పుస్తకం ఇవ్వమని షాపులో అడిగితే.. ఆ దుకాణాదారుడు ఒకటి కాదు, రెండు ఉన్నాయంటూ బీజేపీ ప్రకటించిన 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోల పుస్తకాలు చేతిలో పెట్టాడని ఎద్దేవా చేశారు.

ఆ మేనిఫెస్టోల్లోని 28వ పేజీలో ఇచ్చిన విధంగా రైతులకు పంటలపై 50 శాతం ఆదాయం, నాణ్యమైన విత్తనాల సరఫరా, ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగానికి అనుసంధానం హామీలను అమలు చేయలేదని విమర్శించారు. వ్యవసాయ రంగానికి కేంద్రం బడ్జెట్‌ కేటాయింపులను పెంచాలని, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు