కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి జోష్‌..

28 Nov, 2018 02:38 IST|Sakshi

వరుస బహిరంగ సభలతో కేడర్‌లో ఉత్సాహం 

మాజీ మంత్రులు, సీనియర్ల నియోజకవర్గాల్లోనూ ప్రచారం

నేడు కొడంగల్‌ నియోజకవర్గంలో రాహుల్‌ సభ 

సాక్షి, హైదరాబాద్‌: కాస్త ఆలస్యంగా ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం కేడర్‌లో జోష్‌ నింపుతోందని కాంగ్రెస్‌ వర్గాలు సంబరపడుతున్నాయి. పదునైన మాటలు, ప్రభుత్వ పెద్దలపై విమర్శలతో మొదటి నుంచీ వార్తల్లో ఉన్న వ్యక్తిగా, అధికార టీఆర్‌ఎస్‌కు మింగుపడని నేతగా గుర్తింపు పొందిన రేవంత్‌ ప్రచారానికి ఆశించిన స్పందన లభిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మొదటిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్న అభ్యర్థులతో పాటు మాజీ మంత్రులు, సీనియర్‌ నేతల నియోజకవర్గాల్లో నూ రేవంత్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన దగ్గర నుంచి నిత్యం ఒక బహిరంగ సభ, రోడ్‌ షోలో పాల్గొంటూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు.  

అన్ని నియోజకవర్గాల్లో: కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న జానారెడ్డి నియోజకవర్గంలో రేవంత్‌ రెండ్రోజుల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇతర సీనియర్‌ నేతలైన మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, షబ్బీర్‌అలీ నియోజకవర్గాల్లో ఇప్పటికే బహిరంగ సభలతోపాటు రోడ్‌షో కూడా పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా భారీ రోడ్‌షో నిర్వహించి కార్యకర్తల్లో ఊపు తెచ్చారు. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ఏఐసీసీ అనుమతి తీసుకున్న రేవంత్‌ ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా నిత్యం 2, 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నా రు. ఇప్పటివరకు ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఆసిఫాబా ద్, ఖానాపూర్, బోథ్, కరీంనగర్‌లోని చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, వరంగల్‌ జిల్లా ములుగులో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హామీల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని, మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కొత్త అభ్యర్థులకు కీలకం.. 
మొదటిసారి పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో రేవంత్‌ ప్రచారం ధైర్యాన్ని నింపుతోందని తెలుస్తోంది. సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు వారి నియోజకవర్గాలకే పరిమితం కావడంతో కొత్త అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో రేవంత్‌ ప్రచారం ఆయా నియోజకవర్గాల్లోని కేడర్‌కు ఉత్సాహం నింపుతోంది.  

మేనిఫెస్టోలో ఉత్తమ్‌ బిజీ
టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ పార్టీ మేనిఫెస్టో, అసంతృప్తుల బుజ్జగింపు కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో అంతర్గత సమస్యలతో పార్టీ దెబ్బతినకుండా సమన్వయం చేస్తూనే ప్రచారంలోనూ వేగాన్ని పెంచాలని ఉత్తమ్‌ రేవంత్‌కు సూచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా నల్లగొండ జిల్లాల్లోనూ 4 బహిరంగ సభలు నిర్వహించేందుకు రేవంత్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లోనూ మరో 2 బహిరంగ సభలు, మహబూబ్‌నగర్‌లో 3, ఖమ్మంలో 3, నిజామాబాద్‌ 2 బహిరంగ సభ లు ఈ వారంలో నిర్వహించనున్నట్టు తెలిసింది. తన సొంత నియోజకవర్గంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సభ నిర్వహిస్తు న్నారు. బుధవారం కోస్గి మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు రాహుల్‌ హాజరుకానున్నారు. ఈ సభలో రేవంత్‌ గురించి రాహుల్‌ ఏం చెబుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరిన్ని వార్తలు