సంచలనాలమయం

30 Dec, 2019 05:55 IST|Sakshi

రౌండప్‌- 2019

2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా.

ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు..
విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్‌ సర్వీస్‌ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్‌ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది.

పౌరసత్వ చట్ట సవరణ....
దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు.

కాంగ్రెస్‌లో నేతల కరవు
సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్‌ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్‌ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్‌చార్జ్‌గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌...
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్‌ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్‌పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి.

పుల్వామా దాడులు...
పాకిస్తాన్‌ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్‌ లోపలికి చొరబడి బాలాకోట్‌ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్‌ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది.

మరిన్ని వార్తలు