తెలంగాణ విద్యావ్యవస్థలో మార్పులు తెస్తాం

22 Feb, 2019 01:44 IST|Sakshi
గురువారం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న జగదీశ్‌రెడ్డి. చిత్రంలో గుత్తా, పొంగులేటి తదితరులు

విద్యారంగంపై కేసీఆర్‌కు స్పష్టమైన లక్ష్యాలున్నాయ్‌ 

మన పిల్లలు సర్టిఫికెట్లతో చౌరస్తాలో నిల్చోవద్దన్నదే ఆయన లక్ష్యం

వాటిని తు.చ. తప్పకుండా అమలుచేయడమే నా పని 

ప్రతి మండలంలో గురుకుల తరహా విద్యా బోధన 

పరిశ్రమల అవసరాల మేరకు వృత్తివిద్యలో మార్పులు 

ఇంటర్న్‌షిప్‌కు అత్యధిక ప్రాధాన్యం

‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి

‘రాష్ట్రంలో విద్యారంగంపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఆయన ఆలోచనలను అక్షరం, అక్షరం అమలు చేయడమే విద్యాశాఖ మంత్రిగా నా బాధ్యత. అదే నా లక్ష్యం’అని విద్యాశాఖమంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యారంగాభివృద్ధిపై కేసీఆర్‌ ఆలోచనలు, వాటిని అమలుకు చేపట్టబోయే వివిధ అంశాలను వివరించారు. ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే.. – సాక్షి, హైదరాబాద్‌

ఎక్కడైనా పోటీ పడేలా 
విద్యాశాఖ పట్ల సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అభిప్రాయం ఉంది. మన పిల్లలు కాలేజీ పూర్తయ్యాక సర్టిఫికెట్లు పట్టుకొని క్రాస్‌ రోడ్డులో నిలబడే పరిస్థితి ఉండొద్దు. ఇంటికి వెళ్లి మళ్లీ తల్లిదండ్రులకు భారంగా మారొద్దు. ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడేలా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేలా మన పిల్లలను తీర్చిదిద్ది కాలేజీల నుంచి బయటకు పంపాలనేదే సీఎం ఉద్దేశం. ఒక జాతి, ఒక తరం మొత్తానికి ఉన్నతమైన విద్యను అందించగలిగితే ఆ జాతికి తిరుగేఉండదు. నాగరికమైంది అవుతుందని ఉద్యమ సమయంలో అనేకసార్లు చెప్పేవారు. దాని నుంచి వచ్చిందే కేజీ టు పీజీ ఆలోచన. 

సర్కారు బడుల్లో.. గురుకుల బోధన 
కేజీ టు పీజీలో భాగంగా గురుకుల విద్యకు ప్రా«ధాన్యం ఇచ్చాం. ఇకపై విద్యపైనే దృష్టి పెట్టబోతున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గత ప్రభుత్వంలో చివరి అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. ఈసారి సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిపెట్టాం. వచ్చే ప్రభుత్వం మనదే. అపుడు విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మేం ఆ దిశగానే సాగుతాం. కేజీ టు పీజీ విద్య అమలును గురుకులాల ద్వారా ప్రారంభించాం. అదే స్థాయిలో ప్రతి మండలంలో ఒకట్రెండు పాఠశాలలు పెట్టాలని సీఎంకు ఆలోచన ఉంది. ఈసారి మా ప్రాధాన్యం విద్యకే ఉంటుంది. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల తరహా విద్యాబోధన ఉండాలనేదే సీఎం లక్ష్యం. 

పెరుగుతున్న బడ్జెట్‌ 
విద్యకు బడ్జెట్‌ ఏటేటా పెరుగుతోంది. 500 కొత్త గురుకులాలను ఏర్పాటు చేశాం. దీంతో విద్యపై బడ్జెట్‌ పెరిగింది. విద్యాశాఖ ద్వారా కాకుండా సంక్షేమ శాఖల ద్వారా చాలా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగేలా చేయడంలో విజయవంతం అయ్యాం. ఈ రోజు ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కావాలని వందలాది తల్లిదండ్రులు మా ప్రజాప్రతినిధుల దగ్గరకు వస్తున్నారు. గతంలో ఏ మెడికల్‌ సీటు కోసమో వచ్చేవారు. కానీ ఇప్పుడు గురుకుల సీట్ల కోసం వస్తున్నారంటే ప్రజల్లో ఆ విశ్వాసం కల్పించగలిగాం. దీన్ని ఇంకా విస్తృతం చేయాలి. ప్రజలందరికీ ఆ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కృషి చేస్తాం.

సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం 
పాఠశాల స్థాయి నుంచి వర్సిటీల వరకు ఎక్కడెక్కడ ఏయే సౌకర్యాలు తక్కువగా ఉన్నాయో అవి కల్పిస్తాం. ఏయే ఖాళీలు ఉన్నాయో వాటి భర్తీకి చర్యలు చేపడతాం. ప్రైవేటు స్కూల్‌ ఫీజుల నియంత్రణకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు చేపడతాం. విద్యాశాఖలో ప్రమాణాలు పెంచడమే అందరిముందున్న ప్రధాన సవాల్‌. ఆదిశగా మనమంతా ఆలోచనచేయాలి. దీనికి ప్రభుత్వంతోపాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యారంగంతో భాగస్వామ్యమున్న ప్రతి ఒక్కరూ.. ఈ దిశగా ఆలోచించాల్సిన సమయమిది. 

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా...
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చదువులు గతంలో లేవు. సిలబస్‌కు పారిశ్రామిక సంబంధం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మన ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని బయటకెళ్లినా ఉపాధి లభించడం లేదు. గతంలో కొన్ని కంపెనీలు.. తమ అసవరాలకు అనుగుణంగా వారి చదువు లేదని సీఎంతో చెప్పారు. దీంతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు, సిలబస్‌లో మార్పులు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్, పరిశ్రమలకు అనుగుణంగా టెక్నీషియన్లను తయారుచేయాలని చెప్పారు. విద్య జీవితానికి వెలుగు ఇస్తూనే ఉపాధి అవకాశం కల్పించాలన్నది సీఎం ఆలోచన. ఇంజనీరింగ్‌లో ఆ దిశగా అడుగులు పడ్డాయి. పరిశ్రమలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసేలా, ఇంటర్న్‌షిప్‌ పక్కాగా చేసేలా చర్యలు మొదలయ్యాయి. వీలైతే చివరి మొత్తంలో కంపెనీల్లో పని చేసేలా, కంపెనీలే విద్యార్థుల పనితీరును చూసి వారిని క్యాంపస్‌ సెలెక్షన్‌లో ఎంపిక చేసుకునేలా అవసరమైన అన్ని మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.

మరిన్ని వార్తలు