‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు’

19 Jun, 2018 18:13 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పీడీపీతో పొత్తు విరమించుకున్నట్లు బీజేపీ కశ్మీర్‌ ఇంచార్జి రాం మాధవ్‌ ప్రకటించగానే బీజేపీ మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో స్పందించింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు అంటూ’ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎక్కువకాలం నిలవదని ఉద్ధవ్‌ ఠాక్రే ఎప్పుడో చెప్పారన్నారు. ఒకవేళ పీడీపీతో కలిసి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియకనే బీజేపీ ఈవిధంగా వ్యవహరించిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ కేవలం రాజకీయ లబ్ది కోసమే పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందంటూ విమర్శించారు. ‘అవకాశవాది బీజేపీ... ముందు పీడీపీతో జతకట్టింది. ఇప్పుడు వైదొలిగింది. రెండూ కూడా రాజకీయ లబ్ది కోసమే... ఇలా అయితే దేశం ఎలా మారుతుందని’ ఆయన ట్వీట్‌ చేశారు. పీడీపీతో జతకట్టే ఆలోచన లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు