‘ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆచరణ సాధ్యం కాదు’ | Sakshi
Sakshi News home page

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆచరణలో సాధ్యం కాదు

Published Tue, Jun 19 2018 6:00 PM

MP Bandaru Dattatreya Meets Home Minister Rajnath Singh  - Sakshi

సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఒంటరిగానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని మంగళవారం దత్తాత్రేయ కలిశారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై మాట్లాడినట్లు సమాచారం. శాంతి భద్రతలు, నక్సలైట్‌ సమస్యలు, పలు అభివృద్ది కార్యక్రమాలపై చర్చించినట్లు ఎంపీ తెలిపారు. అంతేకాక ఏపీ, తెలంగాణ హైకోర్టు ఏర్పాటు అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించినట్లు దత్తాత్రేయ చెప్పారు.

‘హైకోర్టు ఏర్పాటు అంశం న్యాయ శాఖ పరిధిలో ఉందని హోంమంత్రి తెలిపారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ, ఇప్పటి వరకూ పంచాయితీ రాజ్‌ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు. సకాలంలో ఎన్నికలు జరుగతాయనే నమ్మకం లేదు. గ్రామ పంచాయితీలో అధికారం ప్రజలకు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ గ్రామ పంచాయితీలకు నిధులు ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ బీజేపీకి ఎక్కడా ఒప్పందం లేదు’ అని దత్తాత్రేయ పేర్కొన్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆచరణలో సాధ్యం కాదని బండారు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. ‘అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపింది. కాంగ్రెస్‌ పార్టీ తమ స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కేసీఆర్‌కి దూరంగా ఉంటుంది. రైతు బంధు పథకం రైతులకు ఉపశమనం మాత్రమే. తెలంగాణలో గ్రామాల వారిగా లబ్ధిదారుల పేర్లను వైబ్‌సైట్‌ ద్వారా బహిర్గతం చేయ్యాలని’  ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement