సీట్ల పంపకమే అసలు పేచీ

28 May, 2018 03:30 IST|Sakshi

యూపీలో తగినన్ని సీట్లు

ఇస్తేనే కూటమిలోకి: మాయావతి

ఆత్మరక్షణలో ఎస్పీ, కాంగ్రెస్‌

లక్నో: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నాలు కొనసాగుతుండగా.. ఉత్తరప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీల మధ్య సీట్ల పంపకం అంత సులువుగా కనిపించడం లేదు. శనివారం పార్టీ కార్యకర్తల భేటీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలతో ఆ విషయం స్పష్టమైంది. తమకు గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తేనే కూటమిలో చేరతామని, లేదంటే ఒంటరిగానే పోటీకి వెళ్లడం ఉత్తమమని మనసులో మాటను ఆమె బయటపెట్టారు.

కార్యకర్తలు ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన పక్షంలో సీట్ల పంపకంపై ఎస్పీ, కాంగ్రెస్‌లపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే మాయావతి ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా.. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 73 స్థానాలు(అప్నాదళ్‌ 2 సీట్లతో కలిపి), సమాజ్‌వాదీ 5, కాంగ్రెస్‌ 2 స్థానాలు గెలుచుకున్నాయి. బీఎస్పీ ఒక్కచోటా విజయం సాధించలేదు. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌లు కూటమిగా పోటీ చేశాయి.

పొత్తు పెట్టుకున్నా.. ఆ రెండు పార్టీలు దాదాపు 12కు పైగా స్థానాల్లో ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. సీట్ల ఒప్పందం చేసుకున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సఖ్యత కుదరలేదు.  ఆ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ 298 స్థానాల్లో, కాంగ్రెస్‌ 105 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండగా.. పలు చోట్ల రెండు పార్టీలు పోటీపడడంతో నష్టపోయాయి. ‘కూటమిగా పోటీ చేస్తున్నప్పుడు పార్టీల మధ్య సీట్ల పంపకం అత్యంత కీలకం. తమకే ఎక్కువ సీట్లు కావాలని ప్రతీ పార్టీ ఆశిస్తుంది. అలాంటి సమయంలో సీట్ల పంపకంపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి’ అని రాజకీయ విశ్లేషకుడు జేపీ శుక్లా పేర్కొన్నారు.  

బీజేపీ ఓటమికి కూటమి తప్పనిసరి: ఎస్పీ  
యూపీ సీఎం ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలైన గోరఖ్‌పూర్, పూల్పూర్‌లో ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీకి బీఎస్పీ మద్దతిచ్చింది. ఆ రెండు స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. అఖిలేశ్‌ స్వయంగా మాయావతి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి సమాజ్‌వాదీ మద్దతిచ్చింది. ‘బీజేపీని ఓడించాలంటే కూటమి ఏర్పాటు తప్పనిసరి. సమ ప్రాధాన్యం దక్కేలా సీట్ల పంపకాన్ని మా అధినాయకత్వం నిర్ణయిస్తుంది’ అని ఎస్పీ నేత రాజ్‌పాల్‌ కశ్యప్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ రాజీపడినా.. మొన్నటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు.. సీట్ల పంపకంపై రాజీ ధోరణిలో వెళ్తాయా? లేదా? అన్నది తెలియాలంటే కొద్ది కాలం వేచిచూడాల్సిందే. 

మరిన్ని వార్తలు