కీలక భేటీకి సీనియర్‌ నేత డుమ్మా.. కారణం అదేనా!

31 Dec, 2019 12:13 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆశించిన పదవి దక్కనప్పుడు రాజకీయాల్లో అలకలు, అసంతృప్తులు సర్వసాధారణం. పార్టీ సభలకు గైర్హాజరు కావడం, నేతలకు అందుబాటులో లేకుండా పోవడం కామన్‌గా జరుగుతుంటాయి. సోమవారం జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కూడా ఇలాంటి ఘటన ఎదురైంది. శివసేన చీఫ్‌, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు అత్యంత నమ్మకస్తుడిగా పార్టీలో గుర్తింపు పొందిన నేత సంజయ్‌ రౌత్‌. శివసేన జాతీయ వ్యవహారాలను ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే ఠాక్రే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యక్రమాలు, సామ్నా వ్యవహారాలను సైతం ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో రౌత్‌ కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. కేబినెట్‌ విస్తరణ సందర్భంగా విధానభవన్‌లో నిర్వహించిన మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంజయ్‌ హాజరుకాలేదు. మంత్రివర్గ విస్తరణకు ముందు మూడు పార్టీల నేతల మధ్య జరిగిన కీలక భేటీకి కూడా రౌత్‌ గైర్హాజరు అయ్యారు. ఈ విషయం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (మంత్రిగా ప్రమాణం చేసిన మాజీ సీఎం)

బీజేపీకి గుడ్‌బై చెప్పి.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఒప్పందం కుదిర్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రౌత్‌ కీలకంగా వ్యవహరించారు. చివరికి అలాంటి వ్యక్తి కీలకమైన కార్యక్రమానికి ఎందుకు రాలేదనేది మరాఠా గడ్డపై ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేన శాసన సభ్యుడిగా ఉన్న రౌత్‌ సోదరుడు సునీల్‌ రౌత్‌కు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం అని సమాచారం. సునీల్‌కు మంత్రిపదవి కోసం సంజయ్‌ తొలి నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు. దీంతో రౌత్‌ తీవ్ర అసంతృప్తికి గురియ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో రౌత్‌ దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. తన సోదరుడికి మంత్రిపదవి ఆశించలేదన్నారు. పార్టీ నిర్ణయానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పదవుల కోసం తానెప్పుడూ పాకులాడలేదని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు