ప్రధాని మోదీకి లీగల్‌ నోటీసులు

7 May, 2018 17:33 IST|Sakshi
ప్రధాని మోదీ, అమిత్‌ షా(ఇన్‌ సెట్‌లో సిద్ధరామయ్య)

సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గట్టి షాక్‌ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు పరువు నష్టం దావా వేశారు. రూ. 100 కోట్లకు ఆయన దావా వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, కర్ణాటక సీఎం అభ్యర్థి యెడ్యూరప్పలకు సోమవారం నోటీసులు జారీ చేశారు. 

‘నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై దావా వేసి.. లీగల్‌ నోటీసులు పంపించా. బహిరంగంగా వారు నాపై ఆరోపణలు చేశారు. అందుకే ప్రజల సమక్షంలోనే వాళ్లు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే’ అని ఓ మీడియా సంస్థతో సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. స్కామ్‌ పేరిట వందల మందిని మోసం చేసిన విజయ్‌ ఈశ్వరన్‌ అనే వ్యాపారవేత్తను సిద్ధరామయ్య రక్షించాలని చూస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. సిద్ధరామయ్య-ఈశ్వరన్‌ కరచలనం చేస్తున్న ఓ ఫోటోను మీడియాకు విడుదల చేసింది. ఈశ్వరన్‌పై కేసులు దాఖలయ్యాక కూడా ఆయన్ని పెట్టుబడుల కోసం సిద్ధరామయ్య కర్ణాటకకు ఆహ్వానించారని, ఈ స్కామ్‌లో సిద్ధరామయ్యకు కూడా వాటా ఉందని, ఇప్పుడు ఈశ్వరన్‌ను రక్షించాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించింది. మరోవైపు మోదీ, అమిత్‌ షా, యెడ్యూరప్పలు ఎన్నికల ర్యాలీల్లో సిద్ధరామయ్యపై అవినీతి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య లీగల్‌ నోటీసులతో బదులిచ్చారు.
  
ఇక జైలుకు వెళ్లొచ్చిన యెడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించటంపై సిద్ధరామయ్య సోషల్ మీడియాలో బీజేపీని నిలదీస్తూనే వస్తున్నారు. దీనికి తోడు అవినీతి మరకలున్న వారికి బీజేపీ సీట్లు ఇవ్వటంపై ఆయన ట్వీట్లతో విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో బహిరంగ చర్చకు రావాలంటూ బీజేపీకి సిద్ధరామయ్య సవాల్‌ కూడా విసిరారు.

మరిన్ని వార్తలు