బరిలో సీఎంల తనయులు

21 Apr, 2018 02:04 IST|Sakshi
యతీంద్ర, విజయేంద్ర

కర్ణాటక ఎన్నికల్లో పలువురు ముఖ్యమంత్రుల పుత్రులు

సాక్షి, బెంగళూరు: కన్నడనాట విధానసభ ఎన్నికల్లో ప్రస్తుత, పలువురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్ర వరుణ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతారని గతంలో ప్రకటించారు. అయితే ఆయనకు వరుణ నుంచి ఇంకా టికెట్‌ కేటాయించకపోయినప్పటికీ, విజయేంద్ర ఆ స్థానంలో పోటీ చేయడం దాదాపు నిశ్చయమేననీ, త్వరలోనే బీజేపీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం సిద్దరామయ్య తన ప్రస్తుత నియోజకవర్గం వరుణను వదిలేసి చాముండేశ్వరి నుంచి బరిలోదిగారు.

యతీంద్రతో పాటు దాదాపు 10 మంది వరకు మాజీ సీఎంల వారసులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గతంలో సీఎంలుగా చేసిన గుండూరావు, జేహెచ్‌ పటేల్, ఎస్‌ఆర్‌ బొమ్మై, ధరమ్‌ సింగ్‌ తదితరులు కొడుకులను ఈసారి విధానసభ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిపారు. ఇక మాజీ సీఎం బంగారప్ప ఇద్దరు పుత్రులు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కుమార బంగారప్ప బీజేపీ నుంచి, మధు బంగారప్ప కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారులిద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీఎస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా దేవెగౌడ కొడుకు, మాజీ సీఎం కుమారస్వామే.

యతీంద్ర వర్సెస్‌ విజయేంద్ర..
ప్రస్తుత ఎన్నిల్లో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులైన సిద్దరామయ్య, యడ్యూరప్ప వారసులు ఇద్దరూ ఒకే స్థానం నుంచి పోటీ చేస్తుండటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కుటుంబ రాజకీయాలకు ఆద్యుడైన దేవెగౌడను గతంలో సిద్దరామయ్య విమర్శించేవారు.  జేహెచ్‌ పటేల్‌ కుమారుడు మహిమా పటేల్‌ దావణగెరి జిల్లాలోని చెన్నగిరి నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థిగా,  ధరంసింగ్‌ తనయుడు అజయ్‌ సింగ్‌ కలబురిగి జిల్లాలోని జీవర్గి నుంచి, హావేరి జిల్లాలోని శిగ్గావ నుంచి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడు బసవరాజ బొమ్మై బీజేపీ టికెట్‌ మీద పోటీ చేస్తున్నారు. అలాగే దివంగత మాజీ సీఎం గుండూరావ్‌ కొడకు, కేపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దినేష్‌ 5వ సారి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆయన ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బెంగళూరులోని గాంధీనగర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

పోటీలో శ్రీమంతులు
దొడ్డబళ్లాపురం: కర్ణాటక ఎన్నికల బరిలో పలువురు శ్రీమంతులు దిగుతున్నారు. నామినేషన్‌ పత్రాలు దాఖలుచేసిన వారిలో కొందరి ఆస్తులు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంటీబీ నాగరాజు తమ కుటుంబ ఆస్తి విలువ రూ.1,015కోట్లుగా పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.102 కోట్లుగా చూపగా, రూ.27 కోట్ల 70 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.  2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తమ మొత్తం ఆస్తి విలువను రూ.470కోట్లుగా ప్రకటించడం గమనార్హం.

అంటే ఈ ఐదేళ్లలో అది రెట్టింపైంది. కాగా, కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన విద్యుత్‌ మంత్రి డీకే శివకుమార్‌ ఆస్తి కూడా గత ఎన్నికల సమయంలో ప్రకటించిన దానికి రెట్టింపైంది. ఈసారి ఆయన తన ఆస్తి విలువను రూ.549 కోట్లుగా ప్రకటించారు. 2008లో కేవలం రూ.75కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి 2013 ఎన్నికల నాటికి రూ. 251 కోట్లకు పెరిగింది. కాగా, శుక్రవారం మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నామినేషన్‌ వేశారు.

      ఎంటీబీ నాగరాజు

మరిన్ని వార్తలు