గహ్లోత్‌  ఓ పొలిటికల్‌  మెజీషియన్‌!

13 Dec, 2018 04:33 IST|Sakshi

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ గెలుపులో కీలక భూమిక 

ముఖ్యమంత్రి రేసులో ముందంజ

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం వెనుక పార్టీ సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ కృషి చాలా ఉంది.  రాష్ట్రంలో పార్టీ మనుగడే ప్రమాదంలో పడిన క్లిష్ట సమయంతో తన అనుభవంతో, వ్యూహాలతో పార్టీకి జీవం పోశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ సీఎం రేసులో, యవ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పోటీ పడుతున్నారు. గహ్లోత్‌ది ఇంద్రజాలికుల కుటుంబం. చిన్నతనంలో తండ్రికి (బాబు లక్ష్మణ్‌ సింగ్‌) సహాయకుడిగా ఇంద్రజాల ప్రదర్శనల్లో పాల్గొనేవారు. రాజకీయాల్లోకి రాకుంటే  మెజీషియన్‌ అయ్యేవాడినని గతంలో అన్నారు. రాహుల్, ప్రియాంక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ సమక్షంలో వారి ముందు గహ్లోత్‌  ఇంద్రజాల విద్య ప్రదర్శించే వారని చెబుతుంటారు. గహ్లోత్‌ మాలి కులస్ధుడు.  గాంధేయవాదిగా పేరొందిన గహ్లోత్‌ మతాచారాలను ప్రేమిస్తారు. వాటిని  పాటిస్తారు. గహ్లోత్‌కు సాత్వికాహారమే ఇష్టం. సూర్యాస్తమయం నుంచి తెల్లారేదాకా ఏమీ తినరు. 

ఇందిర గుర్తించిన నేత 
ఈశాన్య భారతం శరణార్ధుల సమస్యతో సతమతమవుతున్న సమయంలో ఇందిరా గాంధీ అక్కడి శరణార్థి శిబిరాల్ని సందర్శించారు. అక్కడ వాలంటీర్‌గా పనిచేస్తున్న గహ్లోత్‌ మొదటి సారి కలుసుకున్నారు. అప్పటికి గహ్లోత్‌కు 20 ఏళ్లు. గహ్లోత్‌లోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిర ఆయనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇండోర్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశానికి హాజరయిన గహ్లోత్‌కు అక్కడ సంజయ్‌గాంధీతో పరిచయమయింది. త్వరలోనే గహ్లోత్‌ సంజయ్‌కు అత్యంత ఆప్తుడిగా మారారు. గహ్లోత్‌ను సంజయ్‌ ఏరికోరి మరీ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐ రాజస్తాన్‌ విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. ఎమర్జెన్సీకాలంలో సంజయ్‌ బృందం చేపట్టిన మురికివాడల నిర్మూలన, కుటుంబ నియంత్రణ వంటి పలు కార్యక్రమాల్లో గహ్లోత్‌ పాల్గొన్నారు.  రాజీవ్‌ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాకే గహ్లోత్‌ ఢిల్లీలో, రాజస్తాన్‌లో ఒక వెలుగు వెలిగారు. రాజీవ్‌ మంత్రివర్గంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. రాజకీయంగా ఎంత ఎదిగినా స్నేహితులు, సామాన్య ప్రజలతో కలిసి మెలిసి ఉండటం గహ్లోత్‌కు అలవాటు. గహ్లోత్‌ తన సొంత ఊరైన జోధ్‌పూర్‌లో రోడ్డుపక్క టీ బడ్డీ దగ్గర కూర్చుని వచ్చే పోయే వారితో ముచ్చటించేవారు. 

రెండు సార్లు సీఎం 
1998 నుంచి2003 వరకు, 2008 నుంచి 2013 వరకు రాజస్తాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న గహ్లోత్‌ కేంద్రంలోనూ పలు కీలక పదవులు అలంకరించారు. సైన్సు, లాలో డిగ్రీలు చేసిన ఆయన ఎకనామిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందారు. 1951, మే3న జోధ్‌పూర్‌లోని మహామందిర్‌లో జన్మించారు. ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయిన గెహ్లాట్‌ ప్రస్తుతం సర్దార్‌పుర నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు