సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

11 Jan, 2020 11:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశం విడిచిపోతానంటూ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో కొనసాగుతూ దేశాన్ని అవమానించేలా మాట్లాడారు. మరో దేశానికి కాందిశీకుడిగా పోతానంటూ ప్రకటన చేశారు. అసలు ఇక్కడ పౌరుడిగా ఉండటమే దండగని పేర్కొన్నారు. శరణార్థులుగా వేరే చోటకి వెళ్లిపోవడం మేలు అన్నారు. ఈ దేశంలో ఉండటమే అనవసరమని... మీ అందరూ కలిసి రావాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఊరుకుంటే నేరాలు, ఘోరాలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏదో జరిగిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు.

కాగా వివిధ బ్యాంకులకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు చెందిన విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, ఆయన అక్రమ కంపెనీలు, మనీ లాండరింగ్‌ వ్యవహారాలు, వ్యాపార కుంభకోణాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఇందుకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోం మంత్రిత్వ శాఖకు పంపింది.

ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. దీంతో సుజనా అక్రమాస్తులపై విచారణకు రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి టీడీపీని వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు