‘గన్‌మెన్లను తొలగించడం దారుణం’

27 Mar, 2018 20:11 IST|Sakshi
దాసోజు శ్రవణ్‌ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ :  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి గన్‌మెన్లను తొలగించడం దారుణమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు బోడెపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని, ఇప్పుడు ఆయనకు ఏమైన అయితే ప్రభుత్వానిదే బాధ్యత వహించాలన్నారు. కోమటిరెడ్డికి ప్రాణ హాని ఉందని గతంలోనే ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి కక్ష్యపూరిత నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తుందని శ్రవణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వపు నీతిమాలిన చర్య
అసెంబ్లీలో జరిగిన సంఘటనలో కేవలం కోమటిరెడ్డి విసిరిన విజువల్స్‌ మాత్రమే చూపిస్తున్నారని,  స్వామిగౌడ్‌కి తాకిన విజువల్స్‌ని చూపించడంలేదని శ్రావణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వపు దిక్కుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్‌ నీతిమాలిన చర్యతోనే అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌ రెడ్డి రాజీనామా చేశారన్నారు. న్యాయంగా వీడియో ఫుటేజ్‌లను ఇస్తామని చెప్పిన ప్రకాశ్‌ రెడ్డిని ప్రభుత్వం అవమానించిదన్నారు. కేసీఆర్‌ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం న్యాయంగానే సస్పెండ్‌ చేస్తే సాల్వే వంటి అత్యంత ఖరీదైన అడ్వకేట్‌ ఎందుకని ప్రశ్నించారు. బీసీలు అయినా మధుసూదనాచారి, స్వామిగౌడ్‌లను పావులుగా మార్చుకొని ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు