సీఎం జగన్‌కు జేజేలు

10 Jan, 2020 09:06 IST|Sakshi
తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి

కరువుపరిస్థితుల్లో నీరందించారు

అడిగిన వెంటనే స్పందించారు  

తమిళనాడు తరఫున ఏపీ సీఎంకు కృతజ్ఞతలు

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో సీఎం ఎడపాడి

తమిళనాడు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ప్రతిధ్వనించింది. తీవ్రకరువు పరిస్థితుల్లో తెలుగుగంగ నీరిచ్చి ఆదుకున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యుల సాక్షిగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ప్రజల దాహార్తిని చెంబరబాక్కం, పూండి, పుళల్, చోళవరం జలాశయాలు తీరుస్తున్నాయి. 2018లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2019లో చెన్నై నగరం, శివారు ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొన్నాయి. జోలార్‌పేట నుంచి రైలుద్వారా చెన్నైకి నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రుతుపవనాల ప్రవేశం, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కృష్ణానీటి రాకతో నాలుగు జలాశయాల్లో నీటి మట్టం పెరిగింది. నగర శివారు ప్రాంతాల్లోని చివరి ఇంటి వరకూ మెట్రోవాటర్‌ సరఫరా చేయాలని అధికారులు తీర్మానించారు. ఇంతవరకు కృష్ణానది నుంచి తెలుగుగంగ పథకం కింద నాలుగు టీఎంసీల నీరువచ్చింది. ఈ నీటితో ఐదు నెలలపాటు నీటిని సరఫరా చేయవచ్చు. ఈ ఏడాది నీటి కొరత ఉండకపోవచ్చు. కృష్ణా నీరు ఆదుకోవడం వల్లనే చెన్నై నలుమూలలా మెట్రో వాటర్‌ను సరఫరా చేయగలిగామని సీఎం ఎడపాడి అన్నారు. ఫిబ్రవరి ఆఖరు వరకు పూండికి కృష్ణా నీటిని సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు మెట్రోవాటర్‌ అధికారి ఒకరు చెప్పారు.

ధన్యవాద తీర్మానం
ఈనెల 6వ తేదీన ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ప్రసంగానికి సీఎం ఎడపాడి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత ఏడాది వేసవిలో తీవ్రమైనకరువు పరిస్థితులు నెలకొనగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రులు స్వయంగా కలుసుకుని తెలుగుగంగ పథకం కింద తమిళనాడుకు కేటాయించిన నీటిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగుగంగ నీటితో గ్రేటర్‌ చెన్నై ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. తమ కోర్కెను మన్నించి సకాలంలో సహకరించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

తమిళనాడు నీటి అవసరాలను మరింత మెరుగుపరిచేలా గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి వీలైనంత త్వరగా వారి అంగీకారాన్ని పొందాలని కోరుతూ ఉత్తరాల ద్వారా, స్వయంగా కలిసినపుడు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశానని ఎడపాడి పేర్కొన్నారు. ఒకే ఏడాది 9 వైద్యకళాశాలను మంజూరు చేయించుకున్న ఘనతను సాధించామని సీఎం అన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి సీఎం ప్రసంగిస్తూ తిరువళ్లూరు జిల్లాలో ఓ యువతిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల చెల్లించనున్నట్లు చెప్పారు. కొత్త పథకాలకు రూ.6,580 కోట్లను కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తెలిపారు. కొత్తగా ఏర్పడిన తొమ్మిది జిల్లాల్లో ప్రత్యేకాధికారుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు మంత్రి ఎస్‌పీ వేలు ప్రకటించారు.

పౌరచట్ట సవరణపై వాకౌట్‌  
పౌరహక్కు చట్టం సవరణను ఖండిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టేందుకు స్పీకర్‌ అంగీకరించక పోవడంతో డీఎంకే సహా ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. అసెంబ్లీ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత జీరో అవర్‌లో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత దురైమురుగన్‌ మాట్లాడుతూ పౌరహక్కు చట్టం సవరణ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖండన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని స్పీకర్‌కు ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ఒక్క ఉత్తరాన్ని ఇచ్చారు. ఈ ఉత్తరం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలు గురువారంతో ముగుస్తున్నందున ఈరోజైనా తీర్మానం ప్రవేశపెడతారా అని స్పీకర్‌ను ప్రశ్నించారు. స్టాలిన్‌ ఉత్తరం ఇంకా పరిశీలనలో ఉందని స్పీకర్‌ బదులిచ్చారు. మరలా దురైమురుగన్‌ మాట్లాడుతూ పౌరచట్టం సవరణకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇక మాతీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారని నిలదీస్తూ సభ నుంచి సహ సభ్యులతో కలిసి వాకౌట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వానికి ధైర్యం లేదని వాకౌట్‌ అనంతరం మీడియా వద్ద దురైమురుగన్‌ ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు