ఉన్నంకు అసమ్మతి సెగ

2 Mar, 2019 11:56 IST|Sakshi
కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్తున్న అసమ్మతి నాయకులు రామ్మోహన్‌ చౌదరి, నారాయణ, మల్లికార్జున, ఉమామహేశ్వర నాయుడులు

సేవ్‌ ఏపీ’ పేరుతో నిరసన

బలనిరూపణకు పట్టణంలో భారీ ర్యాలీ  

కుటుంబ పాలనతో నలిగిపోయాం

మాలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిపించుకుంటాం

స్పష్టం చేసిన అసమ్మతి నాయకులు  

అనంతపురం, కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం టీడీపీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి.  రాజకీయ కురువృద్ధుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు  ఉన్నం హనుమంతరాయ చౌదరికి సొంత పార్టీలోనూ అసమ్మతి సెగపుట్టింది. ‘సేవ్‌ ఏపీ’ పేరుతో ఎమ్మెల్యే ‘ఉన్నం’ వ్యతిరేక వర్గీయులు శుక్రవారం బల నిరూపణకు దిగారు. నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యార్డు చైర్మన్‌ దొడగట్ట నారాయణ, కంబదూరు జెడ్పీటీసీ రామ్మోహన్‌ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు, ఎంపీపీ మంజుల, మాజీ ఎంపీపీలు మల్లికార్జున, లక్ష్మీనారాయణ చౌదరి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వైపీ రమేష్, స్వర్గీయ బాదన్న కుమారుడు రమేష్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, పట్టణ కన్వీనర్‌ మురళి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బల నిరూపణ ర్యాలీ చేశారు. పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి టీ సర్కిల్, వాల్మీకి సర్కిల్‌ మీదుగా  ర్యాలీ చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి కాకుండా సాయిబాబా ఆలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు.  ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆయన వర్గీయులు ర్యాలీలో పాల్గొనకపోవడమే అసమ్మతి వర్గీయుల బలనిరూపణ అనడానికి నిదర్శనం. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే ఆయన వర్గీయులు శెట్టూరు మండలంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయజేశారు.

కుటుంబ పాలనతో నలిగిపోయాం :   ‘పదేళ్లపాటు ప్రతిపక్షంలో పార్టీ కోసం శ్రమించాం. అధికారంలోకొచ్చాక కుటుంబ పాలనతో నలిగిపోయాం’ అని మార్కెట్‌యార్డు చైర్మన్‌ నారాయణ, జెడ్పీటీసీ రామ్మోహన్‌ చౌదరి, మాజీ ఎంపీపీ మల్లికార్జున, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వైపీ రమేష్, ఉమా మహేశ్వర నాయుడు, బాదెన్న కుమారుడు రమేష్‌ మండిపడ్డారు. ర్యాలీలో భాగంగా టీ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. అందరూ సమష్టిగా కష్టపడి పార్టీని గెలిపించుకుంటే కొందరు స్వార్థపరులు కుటుంబ పాలనతో సంపదను సొంతం చేసుకున్నారని  ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులపై పరోక్షంగా విమర్శలు చేశారు. ర్యాలీకి రాకూడదని స్వార్థ పరులు బెదిరించినా వేలాదిగా తరలివచ్చినందుకు పాదాభివందనం చేస్తామన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే అభ్యర్థిని ఎన్నుకుందామని నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదని, ఇక్కడ కొందరు స్వార్థ పరులు సొంత ప్రచారం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని, పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు.   

మరిన్ని వార్తలు