సిద్దూ వ్యాఖ్యలపై మండిపడ్డ టీకాంగ్రెస్‌

13 Apr, 2018 16:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇసుక విధానం అద్భుతంగా ఉందని పంజాబ్‌ కాంగ్రెస్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఖండించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పిన ఒక వైపే సిధ్దూ వినడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సిద్ధూ మరోసారి ఇక్కడికి వస్తే తాము నిజాలు చూపిస్తామన్నారు. ఆయన ప్రభుత్వం పర్యటనలో ఉన్నారని, పార్టీకి సంబంధించినది కాకపోవడంతో అవగాహన లేదని వ్యాఖ్యానించారు. సిధ్దూ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్‌ దృష్టి తీసుకెళ్లినట్టు శ్రవణ్‌ వెల్లడించారు.

అంతే కాకుండా రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోంది శ్రవణ్‌ పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కొల్లాపూర్‌లో అక్రమంగా ఇసుక దందా జరుగుతోందని అరోపించారు. కొండూరులో ఎలాంటి లైసెన్స్ లేకుండా దొంగచాటుగా ఇసుక అమ్ముతున్నారన్నారు. జూపల్లి కుటుంబ సభ్యులు, బంధువులు  ఈ మాఫియాలో ఉన్నారని ఆయన విమర్శించారు. తామ పార్టీ నేతలు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదన్నారు. పందికొక్కుల్లా తినడం కోసబా తెలంగాణ తెచ్చుకుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనింగ్‌ బాగుందని పక్క రాష్ట్రాల వారితో పొగిడించుకుంటున్నారని మండిపడ్డారు. సర్కార్‌కు చారాణ.. టీఆర్‌ఎస్‌ పెద్దలకు బారాణ వెళ్లే విధంగా ఈ వ్యవహారం జరుగుతోందన్నారు. కేటీఆర్‌కు నీతి నిజాయితీ, తెలంగాణ సోయి ఉంటే.. ఇలా దొంగ ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోవడాన్ని పట్టించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు