అప్పటివరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టరాదు!

2 Jan, 2019 15:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగరా మోగిన నేపథ్యంలో ఎల్లుండి (శుక్రవారం) ఎన్నికల పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. ఇక, పంచాతీయ  ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టరాదని స్పష్టం చేసింది.

భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. ముహూర్తాలు లేకపోవడంతో ఇప్పటికీ సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణ చేపట్టని సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ పూర్తయ్యేవరకు ఇక మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ఐఎఎస్, ఐపీఎస్‌లతో సహా అధికారులెవరినీ బదిలీ చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. బతుకమ్మ చీరల పంపిణీ, రైతుబంధు చెక్కుల పంపిణీ వంటివి వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, పాలక మండళ్లు ఉన్న చోట జిల్లా, మండల, మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చనని, కానీ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సూచించింది. రోజుకు రూ. 50 వేలు నగదు మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు ఈసీ అనుమతించింది. జిల్లాల్లో, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు చేసి.. తనిఖీలు నగదు పంపిణీపై తనిఖీలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు