ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ

28 Oct, 2017 01:23 IST|Sakshi

స్పష్టం చేసిన ప్రభుత్వం

ప్రతిరోజూ ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. శాసన సభ సోమవారానికి వాయిదా పడిన అనంతరం డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఫ్లోర్‌ లీడర్ల సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్, టీడీపీలు గైర్హాజరయ్యాయి. ప్రతి రోజూ ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించారు. పార్టీ సభ్యుల సంఖ్యా బలం ఆధారంగా స్వల్పకాలిక అంశాలను, రొటేషన్‌ పద్ధతిలో ఖరారు చేయనున్నారు. అన్ని బిల్లులు ఒకేసారి కాకుండా వేర్వేరు రోజుల్లో పెట్టాలని ప్రతి పక్షాలు సూచించగా ప్రభుత్వం అందుకు అంగీకరించింది.

బిల్లులపై చర్చను మధ్యాహ్నం సెషన్లలో చర్చిద్దామని ప్రతిపా దించింది. 15 రోజులపాటు సభ నడిపితే చాలంటూ ఈ భేటీలో ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ లేఖ ఇచ్చారు. ఎన్ని రోజులు సభ జరపాలన్న అంశంపై స్పష్టమైన నిర్ణయం ఏదీ జరగలేదని, ఎన్ని రోజులైనా జరిపేం దుకు సిద్ధమని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఫ్లోర్‌ లీడర్లతో అన్నట్టు తెలిసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పది పనిదినాలకు సరిపోను రోజుకు పది ప్రశ్నల చొప్పున వంద ప్రశ్నలను ఎంపిక చేశారు. టీఆర్‌ఎస్‌–69, కాంగ్రెస్‌–16, ఎంఐఎం–6, టీడీపీ–3, సీపీఎం–1, ఇండిపెండెంట్‌–1 చొప్పున ప్రశ్నలను కేటాయించారు.

మరిన్ని వార్తలు