ఓటుకు రూ.10 వేలు!

5 Nov, 2018 11:12 IST|Sakshi

రూ. 5 వేల కోట్లు కేటాయింపు

తంగతమిళ్‌ సెల్వన్‌ పేల్చిన బాంబు

సాక్షి, చెన్నై : ప్రభుత్వాన్ని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఉప ఎన్నికలను సవాల్‌గా తీసుకుందని, ఓటుకు రూ.పది వేలు పంపిణీకి సిద్ధం అవుతోందని అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్‌ సెల్వన్‌ ఆరోపించారు. ఇందుకోసం రూ.ఐదు వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. తేని జిల్లా ఆండిపట్టిలో ఆదివారం అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే  తంగ తమిళ్‌ సెల్వన్‌ మీడియాతో మాట్లాడారు. 18 మంది మీద అనర్హత వేటు వేసిన అన్నాడీఎంకే సమన్వయ కమిటీ, ఇప్పుడు భయంతో వణికిపోతోందని «ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళన వారిలో బయలుదేరిందని పేర్కొన్నారు. ఈ 18తో పాటు తిరుప్పరంగుండ్రం వారి ఖాతా నుంచి చేజారడం ఖాయం అన్న విషయాన్ని గ్రహించారన్నారు. ఈ స్థానాలన్నీ చేజారిన పక్షంలో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అన్నారు. ఇదే అదనపుగా తమ నేత దినకరన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి , ప్రభుత్వ మార్పు మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనలో ఆ సమన్వయ కమిటీ ఉందని ఎద్దేవా చేశారు.

అందుకే ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న సంకల్పంతో ఆ కమిటీ ఉందన్నారు. పదే పదే సమావేశాలు నిర్వహిస్తోందని, శనివారం సాగిన సమావేశంలో చర్చకు వచ్చిన రహస్య సమాచారాలు తమ దృష్టికి చేరాయన్నారు. ఓటుకు పది వేలు పంపిణీకి పాలకులు సిద్ధం అయ్యారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును, ప్రభుత్వ పథకాల కోసం కేటాయించిన నిధుల్ని దారి మళ్లించి 19 స్థానాల్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగానే వ్యూహాల్ని రచించారని ఆరోపించారు. ఒక్కో ఓటుకు రూ.పది వేలు అందించేందుకు సిద్ధం అయ్యారని, ఇందుకోసం ఇన్‌చార్జ్‌ల్ని రంగంలోకి దించారని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవరా>్గనికి రూ.200 కోట్లు చొప్పున ఖాళీగా ఉన్న  20 నియోజకవర్గాలకు కేవలం ఓటర్లను కొనుగోలు చేయడం కోసం రూ.4 వేల కోట్లు కేటాయించినట్టు సమాచారం అందిందన్నారు. అలాగే, మరో వెయ్యి కోట్లు ఇతర ఖర్చులకు కేటాయించి ఉండడాన్ని బట్టి చూస్తే, ఏమేరకు ఈ పాలకులు దోపిడీలకు పాల్ప డి ఉంటారో అనేది స్పష్టం అవుతోందన్నారు. 

మరిన్ని వార్తలు