టచ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

19 Sep, 2019 20:44 IST|Sakshi

     దక్షిణ తెలంగాణలో క్లీన్‌స్వీప్‌ చేస్తాం 

     ఈ నెలలోనే రాష్ట్రానికి రాహుల్‌ 

     మీడియాతో ఉత్తమ్‌ ఇష్టాగోష్టి 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. పీసీసీ ముఖ్య నేతలు, కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. చర్చలు పూర్తయ్యాక ఎప్పుడు చేరుతారనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత మాత్రం కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు.

రాష్ట్రంలో ఏ సంస్థ సర్వే చేసినా, అధికార పార్టీ చేసుకున్న సర్వే అయినా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌కు 70 స్థానాలకు పైగా వస్తాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలోనూ టీఆర్‌ఎస్‌పై భ్రమలు తొలగిపోయాయని చెప్పారు. ఈనెల చివరి రెండు వారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన జరిగే అవకాశం ఉందని తెలిపారు. వరంగల్‌లో దళిత, గిరిజన, బీసీల ఆత్మగౌరవ సభ ఉంటుందని వెల్లడించారు. 

మేం పూర్తి చేస్తే.. 
కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులను టీఆర్‌ఎస్‌ ప్రారంభించిందని ఉత్తమ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క యూనిట్‌ కరెంటును కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ ఉందని, మరి అక్కడ కూడా సీఎం కేసీఆరే కారణమా అని ప్రశ్నించారు. విద్యుత్‌పై పవన్‌కల్యాణ్‌కు అవగాహన లేదన్నారు. పీసీసీ కార్యవర్గంలో మార్పులుంటాయని, వచ్చే ఎన్నికలు తన నాయకత్వంలోనే జరుగుతాయనే విశ్వాసం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల నమోదు ప్రక్రియ వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్టుగా ఉత్తమ్‌ వెల్లడించారు.

కేసీఆర్‌ను గద్దెదించాలి
మోసాలతో ప్రజలను వంచిస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ జెడ్పీటీసీ నారాయణమ్మ, ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ బిలాలతో పాటు వందలాది మంది ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

మరిన్ని వార్తలు