పార్టీల విరాళాలే టార్గెట్‌: ఎలక్టోరల్‌ బాండ్స్‌

2 Jan, 2018 19:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీః రాజకీయ పార్టీలకు అందే ఎన్నికల విరాళాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం  కొత్త ప్రణాళికను  ప్రకటించింది. పార్టీలకు అందే కోట్ల కొద్దీ విరాళాలకు  చెక్‌ పెట్టే యోచనతో  ఎలక్టోరల్‌బాండ్స్‌  పథకాన్ని  లాంచ్‌ చేసింది. 2017 ఫిబ్రవరి 1న  2017-18 బడ్జెట్  ప్రసంగంలో రాజకీయ నిధుల పారదర్శకత అంశాన్ని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో  ఈ బాండ్స్‌పై వివరణ ఇచ్చారు.  ఈ పథకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని, ఈ రోజు నోటిఫికేషన్‌ జారీ చేయనున‍్నట్టు వెల్లడించారు.వీటిని  రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే సందర్భంగా వాడుకోవచ్చన్నారు.

భారతదేశ పౌరుడు లేదా దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు ఈ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  ద్వారా ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి.  ముఖ్యంగా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో పది రోజుల పాటు  ఈ బాండ్లను ఎస్‌బీఐ నుంచి కొనుగోలు చేయొచ్చని  జైట్లీ వివరించారు.  ఇలా వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయలు.. ఇలా ఎంత విలువైన బాండ్‌నైనా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. అలాగే ఈ బాండ్లపై విరాళం ఇస్తున్న వారి పేర్లు ఉండవు.  కానీ ఈ బాండ్లను కొనుగోలు చేసే వ్యక్తి తన కేవైసీ వివరాలను ఎస్‌బీఐకి చెప్పాల్సి ఉంటుందని జైట్లీ స్పష్టంచేశారు.

పేరుకు బాండ్లే అయినా వీటికి వడ్డీ ఉండదు. ఒక రకంగా ప్రామిసరీ నోటు లాంటిది. ఆ విరాళాలు సంబంధిత రాజకీయ పార్టీకి చేరేవరకు ఎస్‌బీఐ బాధ్యత వహిస్తుంది. వీటి కాలపరిమితి 15 రోజులు.  ఈ గడువులోపు సంబంధిత రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీ పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా వీటిని నగదు రూపంలోకి మార్చుకునే వీలుంటుంది.ఈ ఎన్నికల బాండ్ల ద్వారా ఎంత డబ్బు సంపాదించిందో ఎన్నికల కమిషన్ రిటర్న్స్‌లో  ప్రతి రాజకీయ పార్టీ దాఖలు చేయాలని ఆర్థికమంత్రి చెప్పారు.  సార్వత్రిక ఎన్నికలు ఉన్న ఏడాదిలో ప్రతి నెలా 30 రోజుల పాటు ఇస్తారని ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు