Sakshi News home page

శత్రువులు మిత్రులయ్యారు

Published Wed, Jan 3 2018 1:35 AM

Once Enemies Now Became Friends says Kodanda Ram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా నేపథ్యంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలవడం, ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తడంపై టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పందించారు. నిన్నటి వరకు తిట్టుకున్న పవన్‌ కల్యాణ్, కేసీఆర్‌లను చూస్తుంటే శత్రువులు ఆప్తులైనట్లుగా, ఆప్తులు శత్రువులైనట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే వారిలో నిలకడలేదని విమర్శించారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ విషయంలో గతంతో పోలిస్తే మార్పులేవీ జరగలేదని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను ఎక్కువగా కొంటోందని, దీనివల్ల స్థానికంగా ఉత్పత్తి తగ్గిపోతోందన్నారు.

బహిరంగ మార్కెట్‌ ధర కంటే ఎక్కువ ధరకు ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లు చేపడుతున్నదంటే దాని వెనుక ఏదో మతలబు దాగి ఉందని కోదండరాం ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేస్తుండటం వల్ల కరెంటు అవసరంలేని సమయంలోనూ విద్యుత్‌ లైన్లకు డబ్బులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అంతకుముందు కోదండరాం నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలిసింది. కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్‌ విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన 4వ తరగతి ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఆర్‌టీ)లో 50% మార్కుల విధానాన్ని ఎత్తేసి పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని కోరింది.  

Advertisement
Advertisement