ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు

26 Apr, 2019 03:27 IST|Sakshi

సమీక్షలపై సీఎం కేసీఆర్‌ ఎస్‌ఈసీ అనుమతి తీసుకోరా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీపీసీసీ ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల గందరగోళంపై సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌రన్‌ ప్రారంభించడం వంటివి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డికి టీపీసీసీ ఫిర్యాదు చేసింది. ఇంటర్‌ ఫలితాలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారని, ఈ సమీక్షపై ముందుగా ఎస్‌ఈసీ అనుమతి తీసుకుని విధానపరమైన నిర్ణయాలను ముందుగానే వెల్లడించి ఉంటే బాగుండేదని పేర్కొంది. ఇకముందైనా సీఎంకు ఎస్‌ఈసీ ఈ విషయంలో తగిన సూచనలు చేయకపోతే అదే పద్ధతిని పాటించే అవకాశముందని పేర్కొంది.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లబ్ధి పొందేందుకు అనుసరించిన విధానాలనే సీఎం ఇప్పుడు అనుసరిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ నిరంజన్‌ కమిషనర్‌కి లేఖ రాశారు. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందు కు మే మొదటి వారంలో పెంచిన ఆసరా పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధమవుతోందన్నారు. ఎన్నికలకు ముందు గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు కేసీఆర్‌ వివిధ రూపాల్లో జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇది అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కిందకే వస్తుందని.. పరిషత్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడకుండా ఆదేశించాలని కోరారు. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ కాళేశ్వరం వెట్‌రన్‌ను ప్రారంభించడం, సీఎస్‌ ఎస్‌కే జోషి రెండో పంప్‌ ట్రయల్‌రన్‌ను ప్రారంభించనుండడం కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేందుకేనని, అందువల్ల ఇక ముందు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని కోరారు.

మరిన్ని వార్తలు