సిద్ధరామయ్య సలహాకు యోగి కౌంటర్‌

8 Jan, 2018 08:48 IST|Sakshi

సాక్షి : ముఖ్యమంత్రుల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కర్ణాటక పర్యటన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి ఆలస్యం చేయకుండా యోగి కూడా కౌంటర్‌ ఇచ్చారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని.. కర్ణాటకలోని రేషన్‌ షాపులను, ఇందిరా క్యాంటీన్‌లను సందర్శించి ఆదర్శంగా తీసుకోండంటూ సిద్ధరామయ్య యోగికి ఓ సలహా ఇచ్చాడు. దీనికి వెంటనే ఆదిత్యానాథ్‌ కూడా స్పందించారు. ‘‘మీ ఆహ్వానికి కృతజ్ఞతలు.. మీ హయాంలోనే కర్ణాటకలో రైతుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని విన్నాను. అంతేకాదు నిజాయితీ పరులైన అధికారుల బదిలీలు, వారి మరణాలకు కూడా మీ ప్రభుత్వమే కారణమవుతుందంట కదా’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. 

గుజరాత్‌ ఫార్ములా విజయవంతం కావటంతో కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అదే ఫార్ములాను అనుసరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ను రంగంలోకి దించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన టిప్పు జయంతి వేడుకల్లో బీఫ్‌ వడ్డించటం.. ఆ కార్యక్రమానికి సిద్ధ రామయ్యే హాజరుకావటంపై యోగి తీవ్ర విమర్శలు గుప్పించారు. హనుమంతుడి గడ్డపై ఇదేం చెండాలం అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ముందు మీ రాష్ట్రం సంగతి చూస్కోండంటూ యోగికి కౌంటర్‌ ఇస్తున్న సిద్ధ రామయ్య.. బీజేపీ చీఫ్‌ అమిత్‌షా యంత్రాగం ఇక్కడ అస్సలు పని చేయదని.. ఈసారి కూడా కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు