‘కర్ణాటకలో తెలుగు ఓట్లు మావే’

4 May, 2018 17:25 IST|Sakshi
మధుయాష్కీగౌడ్‌, మురళీధర్‌ రావు (ఫైల్ ఫొటో)

ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్

సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకుగానూ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌ రావులు స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకే పడుతాయని మధుయాష్కీ​ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్‌  ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి తీరుతుందని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రజలు కాం‍గ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగిస్తారన్నారు.

2019లో రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలో జరగనున్న ఎన్నికలపై కర్ణాటక ఫలితాలు ప్రభావం చూపుతాయని, ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి కీలకమని పేర్కొన్నారు. 'కర్ణాటక రాష్ట్ర జనాభా దాదాపు ఆరు కోట్లు, వీరిలో తెలుగు ప్రజలు కోటికి పైగా ఉన్నారు. తెలుగువారి ఓట్లు మా పార్టీకి కలిసొచ్చే అంశం, వారు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని' పేర్కొన్నారు. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్‌ విధానాల చాలా నష్టపోయారు: మురళీధర్‌ రావు
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఇన్‌ఛార్జ్‌ మురళీధర్‌ రావు ఎన్నికలపై స్పందిస్తూ... కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీపై నమ్ముతారని, వారి ఓట్లు తమ పార్టీకే వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ కన్నడ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం పోయింది. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించారు. కాంగ్రెస్‌ విధానాల వల్ల కన్నడ ప్రజలు చాలా నష్టపోయారు. వారి చర్యల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పూర్తిగా నష్టపోయింది’ అని వివరించారు.

మరిన్ని వార్తలు