ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్‌కు స్పీకర్‌

28 Nov, 2019 03:05 IST|Sakshi
కూటమి నేతలతో భేటీ తర్వాత అభిమానులకు ఉద్ధవ్‌ ఠాక్రే అభివాదం, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ మనవడైన ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌తో మాట్లాడుతున్న బాల్‌ ఠాక్రే మనవడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్ర సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఉద్ధవ్‌ ఠాక్రే

హాజరవనున్న సోనియా, మమత, కేజ్రీవాల్, స్టాలిన్‌!   మోదీకీ ఆహ్వానం

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే(59) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్‌ అఘాడి’ తరఫున ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారు. కొత్త ప్రభుత్వంలో ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి, కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి లభించనున్నట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ బుధవారం రాత్రి వెల్లడించారు.

ఉద్ధవ్‌తో పాటు మూడు పార్టీలకు చెందిన ఒకరిద్దరు ముఖ్యులూ ప్రమాణం చేస్తారు. ఉద్ధవ్‌ ప్రభుత్వంలో ఒకే ఉప ముఖ్యమంత్రి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, ముంబైలోని వైబీ చవాన్‌ సెంటర్‌లో బుధవారం కూటమి ముఖ్య నేతలు కీలక చర్చలు జరిపారు. మంత్రిమండలిలో ఒక్కో పార్టీకి లభించే ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ తదితరులు చర్చల్లో పాలుపంచుకున్నారు. ఆ తరువాత వారితో కాంగ్రెస్‌ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఖర్గే కలిశారు.

శివసేనకు సీఎం సహా 15, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం సహా 15, కాంగ్రెస్‌కు స్పీకర్‌ కాకుండా 13 మంత్రి పదవులు ఇవ్వాలనే సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు సేన వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ఉదయం గవర్నర్‌ భగత్‌ కోశ్యారీని ఉద్ధవ్‌  మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 20 ఏళ్ల తరువాత శివసేన నేత సీఎం అవుతున్నారు. మహారాష్ట్రలో శివసేన తరఫున తొలి ముఖ్యమంత్రిగా 1995లో మనోహర్‌ జోషి బాధ్యతలు చేపట్టగా, 1999లో నారాయణ రాణె శివసేన తరఫున సీఎం అయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు
మహారాష్ట్రలో తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజీ పార్క్‌లో నేటి సాయంత్రం అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైననే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు.కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాను ఉద్ధవ్‌ కొడుకు ఆదిత్య ఆహ్వానించారు.

సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేను ఉద్ధవ్‌ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతో పాటు  పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్‌ సీఎంలు, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను శివసేన ఆహ్వానించిందని సమాచారం.  ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు.  

అజిత్‌కు డిప్యూటీ సీఎం?
అజిత్‌ పవార్‌కి ఇచ్చే పదవిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్‌ను మరోసారి ఎన్నుకుంటారని, ఉప ముఖ్యమంత్రి పదవీ రావొచ్చని తెలుస్తోంది.

భద్రతపై హైకోర్టు ఆందోళన
ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్‌లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్‌ ధర్మాధికారి, జస్టిస్‌ చాగ్లాల బెంచ్‌ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్‌ ట్రస్ట్‌ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.  

ఎన్సీపీ వెంటే..
బీజేపీకి మద్దతునివ్వడం ద్వారా నాలుగు రోజుల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగి ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వెనక్కి తగ్గిన అజిత్‌ పవార్‌ తాను ఎన్సీపీలోనే ఉన్నానని చెప్పారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణం చేశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుతానికి నేను కొత్తగా చెప్పడానికేమీ లేదు. సమయమొచ్చినపుడు చెప్తాను. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. ఇందులో ఎలాంటి అయోమయానికి తావు లేదు’ అని చెప్పారు. ఇకపై పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే తాను నిర్ణయం మార్చుకొని, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని అజిత్‌ పవార్‌ చెప్పారు. ఉద్ధవ్‌ ఠాక్రే  ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయనకు సముచిత స్థానమే లభిస్తుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం చేపట్టనున్న శివసేన భవిష్యత్తులో కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని రౌత్‌ వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా శివసేన తరఫున వ్యూహకర్తగా, మీడియా ప్రతినిధిగా వ్యవహరించిన రౌత్‌.. ఇకపై తాను పార్టీ పత్రిక ‘సామ్నా’ పనుల్లో నిమగ్నమవుతానన్నారు.

అజిత్‌కు సుప్రియా ఆత్మీయ ఆహ్వానం
మహారాష్ట్ర నూతన ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 285 ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ కాళీదాస్‌ కొలంబ్కర్‌ ప్రమాణం చేయించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన అజిత్‌ పవార్‌కు అనూహ్యమైన రీతిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఆయన సోదరి, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌కు ఎదురై నవ్వుతూ పలకరించి, ఆత్మీయంగా హత్తుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె అయిన సుప్రియా సూలే విధాన సభ ముఖద్వారం దగ్గరే నిల్చొని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ స్వాగతం పలికారు.

రాజకీయ ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల
మరాఠాయోధుడు ఛత్రపతి గుర్తుగా శివాజీ పార్కు
రాజకీయ ఉద్దండులెందరినో పరిచయం చేసిన వేదికది. దేశం గర్వించదగ్గ క్రీడాకారుల ఆశలకూ, ఆకాంక్షలకూ ఊతమిచ్చిన క్రీడాప్రాంగణమది. యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను అనునిత్యం గుర్తుచేసే మరాఠాల పోరాటాలకు పురిటిగడ్డ కూడా అదే ప్రాంతం. అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్ధవ్‌ ఠాక్రే తండ్రి బాల్‌ ఠాక్రే అంతిమ సంస్కారాలకు వేదికగా నిలిచింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతోన్న ఉద్ధవ్‌ ఠాక్రే నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.  

సిటీలోనే అతిపెద్ద పార్కు
ముంబైలోని దాదర్‌ ప్రాంతంలోని శివాజీ పార్కు సిటీలోనే అతిపెద్ద పార్కు. ఎన్నో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన పార్కు వైశాల్యం దాదాపు 28 ఎకరాలు. ఈ పార్కు క్రికెట్‌ క్రీడాకారులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. 1927 వరకు బ్రిటిష్‌ ఇండియాలో 1925లో ప్రారంభించిన ఈ పార్కు అనంతర కాలంలో ముంబైలోని ఎన్నో స్వాతంత్య్రోద్యమాలకు కేంద్రబిందువైంది. 1947 స్వాతంత్య్ర కాలం నుంచి సంయుక్త మహారాష్ట్ర చాల్‌వాల్‌ (మహారాష్ట్ర ఏకీకరణ) ఉద్యమానికి ఇదే పార్కు వేదికయ్యింది. ప్రముఖ పాత్రికేయులు, నాటకరచయిత, కవి, సామాజిక నేత ఆచార్య ప్రహ్లద్‌ కేశవ్‌ అత్రే నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం 1960 మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటుకి దారితీసింది. ఆ తరువాత శివసేన నడిపిన ఎన్నో రాజకీయ ఉద్యమాలు ఈ వేదికగా ప్రారంభించారు.  

మహిమా పార్కు
ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ బ్రిటిష్‌ కాలంలో ఈ పార్కుని ఏర్పాటు చేశారు. 1927 వరకు ఈ పార్కుని మహిమా పార్కుగా పిలిచేవారు.  మున్సిపల్‌ కౌన్సిలర్‌ అవంతీ గోఖలే ఆదేశాల మేరకు ఛత్రపతి శివాజీ పేరుని  పెట్టారు. పార్కులోపలి వైశాల్యం 1.17 కిలోమీటర్లు. మొత్తం మైదానం 112,937 చదరపు మీటర్లు. ఈ ప్రాంగణంలో టెన్నిస్‌ కోర్టు, వ్యాయామశాల, పిల్లల, వృద్ధుల పార్కులు, లైబ్రరీలు ఉన్నాయి.  

సైలెన్స్‌ జోన్‌గా ప్రకటించిన కోర్టు
నిత్యం రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉన్న ఈ పార్కు వల్ల ధ్వని కాలుష్యం ఎక్కువైందంటూ స్థానికులు 2009లో కోర్టుకి వెళ్ళారు. దీంతో మే, 2010లో బాంబే హైకోర్టు ఈ ప్రాంగణాన్ని సైలెంట్‌ జోన్‌గా ప్రకటించింది.



అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్‌ను ఆత్మీయంగా పలకరిస్తున్న సుప్రియా సూలే.

మరిన్ని వార్తలు