ధనిక రాష్ట్రంలో ‘ఉపాధి’ డబ్బులివ్వలేరా?

13 Feb, 2018 03:21 IST|Sakshi

4 నెలలుగా కూలీలకు వేతనాల్లేవు: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ధనిక రాష్ట్రం తమదేనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ‘ఉపాధి హామీ’కూలీలకు వేతనాలివ్వలేరా.. అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పనిచేసిన 15 రోజుల్లోగా కూలీలకు వేతనాలివ్వాల్సి ఉండగా, నాలుగు నెలలైనా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నారాయణగూడలోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డితో కలసి ఆయన కార్మిక నేతలతో భేటీ అయ్యారు.

నిరుపేదలకు సామాజిక భద్రత, కనీస ఉపాధి కల్పించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని, దీన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన కొత్తలోనే ఈ చట్టాన్ని విమర్శించారని, ఇప్పుడు కేసీఆర్‌ కూడా ఉపాధి కూలీలకు వేతనాలివ్వకుండా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు.

ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్‌ ప్రతిఘటిస్తుందని, కూలీలకు రావాల్సిన వేతనాలపై అసెంబ్లీ లోపలా, బయటా పోరాటం చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పేదలు, కార్మికుల అభివృద్ధి కోసం పనిచేస్తే, మోదీ సర్కార్‌ అదానీ, అంబానీల కోసం పనిచేస్తోందని కుంతియా విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికులు ఏకమైతే ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని అన్నారు.

మరిన్ని వార్తలు