ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్‌

18 Nov, 2019 02:06 IST|Sakshi
ఆదివారం సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో షబ్బీర్‌ అలీ, రేవంత్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల, కుసుమకుమార్, శ్రీధర్‌బాబు, పొన్నం

ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ పిటిషన్‌పై ఉత్తమ్‌ సీరియస్‌

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నామనేది పచ్చి అబద్ధం

కాంగ్రెస్‌ను అస్థిరపరిచేందుకు సీఎం కేసీఆరే ప్రయత్నించారు

సునీల్‌శర్మ ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారో తేల్చాలి

ఆర్టీసీని కాపాడుకుంటాం.. సడక్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు

కార్మికులకు సెప్టెంబర్‌ వేతనాన్ని చెల్లించాలన్న కాంగ్రెస్‌ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ యూనియన్లతో కలసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టులో దాఖలు పిటిషన్‌ దాఖలు చేయడంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తాము ఆర్టీసీ యూనియన్ల తో కలసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని భావించడం లేదని, అలాంటి ఆలోచనే తమకు లేదని స్పష్టంచేశారు. తమ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను తన అధికారిక నివాసానికి పిలిపించుకుని కాంగ్రెస్‌ పార్టీని అస్థిరపర్చేందుకు సీఎం కేసీఆరే ప్రయత్నించారని, అయినా తాము రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నామని చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య నేతలతో కలసి ఉత్తమ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హైకోర్టులో... అది కూడా ప్రధాన న్యాయమూర్తి ముందు లిఖిత పూర్వకంగా పచ్చిఅబద్ధం ఎలా చెబుతారని, దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. అవసరమైతే సీబీఐ లాంటి సంస్థలతో విచారణ జరిపించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిన ఆధారాలుంటే తమను జైలు కు పంపాలని, లేదంటే ఐఏఎస్‌ అధికారి సునీల్‌శర్మపై చర్యలు తీసుకుని డిస్మిస్‌ చేయాలని హైకోర్టును కోరారు. సునీల్‌శర్మ ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారో తేల్చాలన్నారు. దీన్ని తామూ సీరియస్‌గా తీసుకుంటామని, చట్టపరంగా హైకోర్టులో అప్పీల్‌ చేస్తామని, డీవోపీటీ దృష్టికి తీసుకెళ్తామని, ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావిస్తామని ఉత్తమ్‌ చెప్పారు.  

రాష్ట్రం కేసీఆర్‌ జాగీర్‌ కాదు 
ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ఏపీఎస్‌ఆర్టీసీ గిన్నీస్‌ రికార్డుల్లో కూడా స్థానం సంపాదించిందని, అలాంటి సంస్థను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆర్టీసీ కార్మికులేనని చెప్పారు. కానీ, కేసీఆర్‌ మాత్రం రాష్ట్రం ప్రైవేట్‌ ఎస్టేట్‌గా భావిస్తున్నారని, రాష్ట్రం ఆయన జాగీర్‌ కాదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిందని, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలు మోడల్‌ ఆర్టీసీని నడిపిస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ అంటే లాభనష్టాల అంశం కాదని, ప్రజారవాణాను సంక్షేమ అంశంగా భావించి సమ్మె పరిష్కారానికి ప్రయత్నించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్‌ వేతనాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో సుదీర్ఘంగా కేసు నడుస్తోందని, సమ్మెపై సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  

అమానవీయ సీఎం.. 
24 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినా స్పందించని అమానవీయ సీఎం కేసీఆర్‌ అని, తెలంగాణ ఆర్టీసీని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలుగా పోరాడుతుందని ఉత్తమ్‌ చెప్పారు. అంతమంది చనిపోయినా కేసీఆర్‌ అహం తగ్గలేదా అని యావత్‌ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోందన్నారు. ఆర్టీసీ కేసుల్లో పార్టీ పరంగా ఇంప్లీడ్‌ అయ్యే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అంతకుముందు ఆర్టీసీ జేఏసీ సభ్యుడు డీవీ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం గాంధీభవన్‌లో ఉత్తమ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలను కలసి ఈనెల 19న నిర్వహించనున్న సడక్‌ బంద్‌కు మద్దతివ్వాలని కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఉత్తమ్‌ సడక్‌ బంద్‌కు తాము సంపూర్ణ మద్దతినిస్తున్నామని చెప్పారు. 

పార్లమెంటులో ఆర్టీసీ సమ్మె అంశం.. 
అంతకుముందు గాంధీభవన్‌లో ఉత్తమ్‌ టీపీసీసీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వీహెచ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తా వించాలని, తెలంగాణ ఎంపీల పక్షాన కేంద్రం చొరవను కోరాలని నిర్ణయించారు. ఈనెల 30న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదా నంలో జరగనున్న ‘భారత్‌ బచావో ర్యాలీ’పై చర్చించారు. ఈ ర్యాలీకి రాష్ట్రం నుంచి వెళ్లాల్సిన వారితో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్‌కు అప్పగించారు.  

ఉత్తమ్‌... స్లిమ్‌ అయ్యారు  
‘ఆరడుగుల ఆజానుబాహుడు.. మిలటరీలో పనిచేశాడు.. ఆయనకేంటిలే ఆరోగ్యంగా ఉంటాడు’ టీపీసీసీ చీఫ్‌ కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చూసిన వారికి సహజంగా కలిగే భావన ఇది. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను పాటించాలనుకున్నారో ఏమో కానీ, తన ఎత్తు, వయసుకు తగ్గట్లుగా శరీర బరువును కాపాడుకునేందుకు ఆయన 15 రోజులపాటు శ్రమించారు. బెంగళూరులోని జిందాల్‌ నేచర్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ఏకంగా 8.3 కిలోల బరువు తగ్గారు. 6.1 అడుగుల ఎత్తున్న ఉత్తమ్‌ 82 కిలోల బరువు ఉండాల్సి ఉండగా, ఏకంగా 95 కిలోలకు చేరుతుండడంతో చికిత్సకు వెళ్లారు. అందులో భాగంగా 94.5 కిలోల నుంచి 86.2 కిలోలకు తగ్గారు. ‘ప్రకృతి చికిత్స కోర్సు చాలా సీరియస్‌గా నేర్చుకున్నాను. బరువు ఇప్పటికీ ఇంకా 4 కిలోలు తగ్గాల్సి ఉంది. వయసు, ఎత్తుకు తగిన బరువును కాపాడుకోవడం అందరి బాధ్యత’ అని ఉత్తమ్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు